కూలీ పనుల కోసం పోరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగించినందున కూలీలు ఎలాగైనా తమ రాష్ట్రానికి వెళ్లే ప్రయత్నం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వినోభానగర్, గుండెపుడి ప్రాంతాల నుంచి 14న రాత్రి సమయంలో సుమారు 200 మంది కూలీలు వారి పిల్లలు, సామగ్రితో కాలినడకన ప్రారంభించి పొలాలు, అటవీ ప్రాంతం మీదగా ఖమ్మం జిల్లా ఏన్కూరు వద్ద ఎన్నెస్పీ కాలువ వద్దకు చేరుకున్నారు. 15న ఉదయం కాలినడకన వెళ్తున్న కూలీలను గుర్తించిన ఏన్కూరు పోలీసులు, అధికారులు వారిని అడ్డుకున్నారు. విషయాన్ని భద్రాద్రి జిల్లా అధికారులకు తెలిపారు.
ఆ జిల్లా సబ్ కలెక్టర్ అనుదీప్, అధికారులు, పెనుబల్లి సీఐ కరుణాకర్, ఎస్సై శ్రీకాంత్‌లో వారికి నచ్చజెప్పి ట్రాక్టర్ల ద్వారా వారు వచ్చిన ప్రాంతాలకు పంపే ప్రయత్నాలు చేశారు. దీనికి వారు ససేమిరా అంటూ కాల్వకట్టపైనే కూర్చుని తాము తిరిగి వెళ్లమని, తమ రాష్ట్రానికిన పంపాలని పిల్లలతో సహా ట్రాక్టర్ల ఎదుట ధర్నాకు దిగారు. చివరకు ఖమ్మం జిల్లా అధికారులు నచ్చజెప్పి ట్రాక్టర్ల ద్వారా భద్రాద్రి సరిహద్దు వరకు తీసుకెళ్లి అక్కడ అధికారులకు అప్పగించారు. అక్కడ కొద్దిసేపు వెళ్లమని కూలీలు బైఠాయించి పోలీసులతో వాదన పడ్డారు. ఇది కాస్త పోలీసులు, కూలీలకు మధ్య ఘర్షణకు దారి తీసింది.
ఓ క్రమంలో కూలీలు పోలీసులపై రాళ్లతో దాడికి యత్నం చేశారు. ఓఎస్డీ రమణారెడ్డి తమ బలగాలతో రావడంతో కూలీలు శాంతించారు. చివరకు వారిని పడమట నర్సాపురం గిరిజన ఆశ్రమ పాఠశాలకు తరలించారు. ఐదు గంటల పాటు కొనసాగిన ఆందోళన సద్దుమణిగినందున పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఎఫెక్ట్:17రోజుల బిడ్డను తొలిసారి చూసిన తల్లి