గోదావరి పరీవాహక ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు మావోయిస్టుల ఆచూకీ కోసం ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న మావోలు వారికి చిక్కడం లేదు. ఫలితంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అడవుల్లో పోలీసుల బూట్ల చప్పుళ్లు, మావోల కదలికలతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక అటవీ ప్రాంతంలోని పల్లెల్లో ప్రజలు భయం గుప్పిట్లో జీవిస్తున్నారు.
మూడోరోజూ ముమ్మర కూంబింగ్
ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన మావోలు మళ్లీ తిరిగి వెళ్లే దారి లేదని పోలీసులు గట్టి నమ్మకంతో వారి ఆచూకీ కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. మణుగూరు, కరకగూడెం, అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. మూడో రోజు అడవిని అణువణువూ గాలిస్తూ వారికోసం విశ్వప్రయత్నాలు చేశారు. అటవీ ప్రాంతంతో పాటు మండల కేంద్రాలు, ప్రధాన రహదారులపై ముమ్మరంగా వాహనాల తనిఖీ చేస్తున్నారు.
మావోయిస్టుల పయనమెటు..?
అటవీ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్న వేళ మావోయిస్టులు ఎటు వెళ్లారన్న ప్రశ్నలు ఇప్పుడు పోలీసులకు అంతుచిక్కడం లేదు. ఎదురుకాల్పులు జరిగిన సమయంలో కిట్ బ్యాగులు, ఆయుధాలు, సామగ్రి పోలీసులకు లభించినా... వారి జాడ మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు చిక్కకుండా మావోలు ఎటు వెళ్లారన్న సందేహాలు శేష ప్రశ్నలుగానే మిగిలాయి. మూడ్రోజుల గాలింపు చర్యలకు కూడా వారి జాడ లేకపోవడం గమనార్హం.
బిక్కుబిక్కుమంటున్న గిరిజన పల్లెలు
మూడ్రోజులుగా జరుగుతున్న పరిణామాలతో అటవీప్రాంతం సరిహద్దుల్లో ఉన్న గిరిజన పల్లెలు బిక్కుబిక్కుమంటున్నాయి. మణుగూరు, కరకగూడెం, అశ్వాపురం మండలాల్లోని అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన గ్రామాలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాయి.
కూంబింగ్ ఆపరేషన్ ఆపేయాలి: మావోయిస్టు పార్టీ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. కరోనా విపత్కర పరిస్థితుల్లో భౌతిక దాడులకు పాల్పడకుండా మావోయిస్టులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నామని మావోయిస్టు పార్టీ ఓ ప్రకటనలో ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖతో పాటు ఆడియో విడుదల చేశారు. మావోయిస్టులను అణిచివేసేందుకు ప్రయోగించిన గ్రేహౌండ్స్ బలగాలను వెంటనే అడవుల నుంచి ఉపసంహరించాలని జగన్ డిమాండ్ చేశారు. దళాలపై దాడులు ఆపకపోతే భాజపా, తెరాస నాయకులకు ప్రజాకోర్టులో శిక్షలు తప్పవని లేఖలో జగన్ హెచ్చరించారు.
ఇవీ చూడండి: 'ప్రయివేటు ఆసుపత్రులు ఎందుకు? సర్కారు అండగా ఉంటుంది'