Bhadradri Temple: రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవాలంటే భక్తుల జేబులు గుళ్ల చేసుకునే పరిస్థితి నెలకొంది. వాహనాల ఆశీలు రుసుం మొదలు తలనీలాలు సమర్పించుకునే వరకు అధిక ధరలతో సామాన్యుల నడ్డివిరుస్తున్నారు. నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న భద్రాచలం పుణ్యక్షేత్రానికి.. ప్రతిరోజు వేల మంది భక్తులు సుదూరు ప్రాంతాల నుంచి వస్తుంటారు.
సొంత వాహనాల్లో ప్రయాణం చేసి భద్రాచలం చేరుకుంటున్నారు. రామయ్య దర్శనం కోసం సొంత వాహనాల్లో వచ్చే భక్తుల నుంచి ఆశీలు వసూలు చేయాలని భద్రాచలం గ్రామపంచాయతీ ఈనెలలో తీర్మానించింది. ఓ గుత్తేదారు వేలం దక్కించుకుని... వాహన సామర్థ్యాన్ని బట్టి పార్కింగ్ ఫీజు రూ.30 నుంచి రూ.150 వరకు వసూలు చేయాలని నిర్ణయించారు. బోర్డుపై ఉన్న ధర కంటే అధికంగా ఫీజు వసూలు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
కార్లకు, ఆటోలకు పార్కింగ్ రుసుం రూ.50 తీసుకోవాల్సిన ఉండగా రూ.150 వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం.. ఆశీలు వసూలు చేయకుండా అదనంగా తీసుకుంటున్నారని.. భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్కింగ్ రుసుంతో చేతిచమురు వదిలించుకుంటున్న భక్తులకు... ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా అధిక ధరలు తలనొప్పిగా మారాయి. కొబ్బరికాయలు కొనడం మొదలు తలనీలాలు సమర్పించే వరకు.. నిలువు దోపిడీకి గురవుతున్నారు. తల నీలాలు సమర్పించేందుకు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు.
ఇతర ఏ ఆలయాల వద్ద ఇంత పెద్దమొత్తంలో వాహనాలకు ఆశీలు వసూలు చేయట్లేదు. కేవలం భద్రాచలంలో మాత్రమే కనీస రుసుం కన్నా ఎక్కువగా డబ్బులు వసూలు చేస్తున్నారని ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
"నిబంధనలు పాటించకుండా ఆశీలు వసూలు చేస్తున్నారు. కారుకు బోర్డుపై రూ.50 ఉంటే రూ.150 తీసుకుంటున్నారు. ఇదేంటని అడిగితే వారు అంతే అని చెబుతున్నారు.ఆలయంలో తలనీలాల సమర్పణకు అధిక ధర వసూలు చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలి." -భక్తులు
ఇదీ చదవండి: 'పంజాబ్ రైతులపై ఎందుకంత ప్రేమ... పార్థసారథి రెడ్డి ఎపిసోడ్ ఆపేదేలే'
కాంగ్రెస్ కోసం 'టాస్క్ఫోర్స్'.. మూడు బృందాలతో ఎన్నికలకు రెడీ!