bhadradri temple: భద్రాద్రిలో పాల్గుణ పౌర్ణమి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయబద్దంగా ఆలయ అధికారులు శ్రీరామనవమి పనులు ప్రారంభించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవమూర్తులకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు. చిత్రకూట మండపంలో పసుపుకొమ్ములు దంచే ఉత్సవం, తలంబ్రాలు కలిపే వేడుక జరిపారు. బేడా మండపం వద్ద లక్ష్మణ సమేత సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు.
![Swamis at holi festival celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14767110_ramulavaru.png)
నిత్యం జరిగే కల్యాణంలో పసుపు రంగు తలంబ్రాలను ఉపయోగిస్తే.. ఏడాదికి ఒకసారి జరిగే శ్రీరామనవమి కల్యాణంలో మాత్రం ఎరుపు రంగు తలంబ్రాలను ఉపయోగిస్తారు. ఇందుకోసం తానీషా కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం గులాలు కలుపుతారు. వీటి వల్ల తలంబ్రాలకు ఎరుపు రంగు వస్తుంది. పసుపు, కుంకుమ, సెంటు, రోజ్ వాటర్, నూనె, నెయ్యి పోసి అక్షతలకు పరిమళాలను జోడిస్తారు.
![గోటితో ఒలిచిన తలంబ్రాలతో భక్తులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14767110_bhakthulu.png)
ఆలయంలో ఘనంగా వసంతోత్సవం
కుంకుమ, సెంటు కలిపిన పన్నీరును తయారుచేసి, బుక్కాను, గులాములు జోడించి స్వామి వారికి హోలీ పండుగ నిర్వహించారు. అనంతరం భక్తులు ఒకరికి ఒకరు రంగులు పూసుకుని రంగు నీళ్లు చల్లుకున్నారు.
![Holi celebrations of devotees at the temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14767110_celebrations.png)
ఏప్రిల్ 9న సీతారాములకు ఎదుర్కోలు , 10న సీతారాముల కల్యాణం...11న రామ పట్టాభిషేక మహోత్సవం జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను స్వామివారికి సమర్పించేందుకు భద్రాద్రికి భారీగా భక్తులు తరలివచ్చారు. వేదమంత్రోచ్చరణాల మధ్య డోలోత్సవం కనులపండువగా నిర్వహించారు.
ఇదీ చదవండి: భక్తుల సమక్షంలో భద్రాద్రి రాములోరి కల్యాణం: ఇంద్రకరణ్ రెడ్డి