భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పనిచేస్తున్న పొరుగు సేవల సిబ్బంది జీతం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 200 మంది కార్మికులుండగా... మూడు నెలలుగా జీతం రావట్లేదని వాపోతున్నారు. రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రం నెలనెల జీతాలు వస్తున్నా... అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం మూడు నెలలకోసారి కూడా జీతాలు పడడంలేదు.
ఈ పరిస్థితి కొత్తేమి కాదని... ప్రతీసారి ఇలాగే జరుగుతోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాముని పల్లకి మోయటం దగ్గర్నుంచి... భక్తులకు, ఉద్యోగులకు తాగునీరు అందించే వరకు అవుట్సోర్సింగ్ కార్మికులే చూసుకుంటారు. అన్ని పనులు చేసినా... జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను అడిగితే... ఆలయ ఆదాయం సరిపోవటం లేదనే కారణాలు వెలువడుతున్నాయి.
గత నెలలో హుండీ ఆదాయం లెక్కించగా సుమారు రూ.70 లక్షలు వచ్చింది. ఆ డబ్బుల రెగ్యులర్ ఉద్యోగుల జీతాలకే సరిపోగా... అవుట్సోర్సింగ్ కార్మికులకు ఖాళీ చేతులు చూపించారు అధికారులు. మళ్లీ హుండీలు తెరిస్తే కానీ కార్మికుల జీతాలు రాని పరిస్థితి నెలకొంది. ఆదాయంతో సంబంధం లేకుండా... రెగ్యూలర్ ఉద్యోగులతో పాటే తమకు జీతాలు చెల్లించి ఆదుకోవాలని అధికారులను పొరుగుసేవల కార్మికులు కోరుకుంటున్నారు.