ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతంలో ఉన్న తెలంగాణలోని భద్రాచలానికి కరోనా వైరస్ ముప్పు పొంచి ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ వంటి నగరాల నుంచి వలసకూలీలు తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు భద్రాచలం మీదుగానే వెళ్లాల్సి వస్తోంది. భద్రాచలంకు వచ్చిన వలసకూలీలు ఇక్కడి నుంచి ప్రైవేటు వాహనాలు మాట్లాడుకొని వారి రాష్ట్రాలకు వెళ్తున్నారు. గత రెండు రోజుల నుంచి తెలంగాణలో బస్సులు తిరుగుతున్నప్పటికీ వేరే రాష్ట్రాలకు అనుమతి లేకపోవడం వల్ల వలసకూలీల భద్రాచలం నుంచి ప్రైవేటు వాహనాలు మాట్లాడుకొని వారి రాష్ట్రాలకు వెళ్తున్నారు.
ఈ క్రమంలో భారీగా తరలివస్తున్న వలస కార్మికులను ప్రైవేట్ వాహనదారులు భౌతిక దూరం లేకుండా వాహనాల్లో ఎక్కువ మందిని ఎక్కించుకుంటున్నారు. దీనివల్ల వలస కార్మికుల నుంచి ఆటో డ్రైవర్లకు, ప్రైవేట్ వాహనదారులకు వైరస్ వ్యాపించే అవకాశం కనిపిస్తోంది. స్థానిక అధికారులు ప్రైవేట్ వాహనదారులకు తాత్కాలిక సూచనలు ఇవ్వడం వల్ల వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణికులను తీసుకెళ్లాల్సి ఉండగా… వాహనాల్లో పరిమితికి మించి వలసకూలీలను తీసుకెళ్తున్నారు. ఒకే ఆటోలో 20 మంది వలసకూలీలు ఒకరిపై ఒకరు కూర్చుని వెళ్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: కరోనా విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా లేదు: ఉత్తమ్