మృతదేహం వద్ద మావోయిస్టుల లేఖ
ఓ ద్విచక్రవాహనాన్ని, ఓ లేఖను మావోయిస్టులు మృతదేహం వద్దే వదిలి వెళ్లారు. చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట లేఖ రాశారు. పోలీసులకు శ్రీనివాసరావు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నందునే హతమార్చామని పేర్కొన్నారు. దళాల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోలీసులకు అందిస్తున్నాడని లేఖలో తెలిపారు. ఆదివాసీలకు సంబంధించిన 70 ఎకరాల భూములను పోలీసుల సాయంతో అక్రమంగా లాక్కున్నాడని ఆరోపించారు.
భయాందోళనలో ఏజన్సీ...
ఈ నెల 8న రాత్రి సమయంలో బెస్తకొత్తూరులోని శ్రీనివాస్ నివాసంపై 15 మంది మావోయిస్టులు దాడి చేసి అపహరించుకుపోయారు. నాలుగురోజుల నుంచి మావోయిస్టుల చెరలో ఉన్న శ్రీనివాస్ని ప్రజాకోర్టు నిర్వహించి విడుదల చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా... ఇవాళ మధ్యాహ్నం రక్తపుమడుగులో విగతజీవిగా పడి ఉన్న మృతదేహాన్ని ఆదివాసీలు గుర్తించారు. ఈ సమాచారంతో ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర అలజడి చెలరేగింది.
శోకసంద్రంలో కుటుంబం...
తన భర్త కచ్చితంగా ప్రాణాలతో క్షేమంగా తిరిగివస్తాడని ఎదురుచూసిన శ్రీనివాస్ భార్య, కుమారునికి విషాదమే మిగిలింది. కిడ్నాప్ రోజు నుంచి కునుకు లేకుండా వేచి చూసిన కుటుంబసభ్యులు... మరణ వార్త విని కన్నీరు మున్నీరవుతున్నారు. మూడేళ్ల క్రితం చర్ల మండలానికి చెందిన ముగ్గురు నాయకులను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు... క్షేమంగానే విడుదల చేశారు. కానీ... శ్రీనివాసరావు విషయంలో అంచనాలు తారుమరయ్యాయి.
ఎంపీటీసీని చంపడం హేయమైన చర్య: ఎస్పీ
హత్యపై జిల్లా ఎస్పీ సునీల్ దత్ స్పందించారు. శ్రీనివాస్ పోలీస్ ఇన్ఫార్మర్ కాదని, డిపార్ట్మెంట్తో అతనికి ఎలాంటి సంబంధం లేదని తెలియజేశారు. రైతులకు అండగా నిలిచే ఇలాంటి వ్యక్తులను టార్గెట్ చేసి చంపుతూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తున్నారని.. ఇలాంటి వారిని వదలబోమని హెచ్చరించారు.
ఇవీ చూడండి: కిడ్నాప్ చేసి ఎంపీటీసీని హతమార్చిన మావోలు