భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండల ఎంపీడీఓ కార్యాలయానికి ఎంపీపీ.. కార్యాలయ సిబ్బందితో తాళం వేయించారు. టేకులపల్లి ఎంపీడీఓ విజయను అశ్వరావుపేట బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి శనివారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అయినప్పటికీ ఎంపీడీఓ మాత్రం తనకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు అందలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కూడా విజయ విధులకు హాజరయ్యేందుకు వస్తారని సమాచారం తెలుసుకున్న ఎంపీపీ రాధ.. నిన్న ఉదయం కార్యాలయానికి చేరుకుని తాళం వేయించారు. ఎవరు వచ్చినా తాళం తీయొద్దంటూ కార్యాలయ సిబ్బందికి హుకుం జారీ చేశారు.
మరికొద్ది సేపటికి విధులకు హాజరయ్యేందుకు ఎంపీడీఓ.. మండల పరిషత్ కార్యాలయానికి వచ్చారు. తన గదికి తాళం వేసి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం టేకులపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు.
ఎంపీడీఓను బదిలీ చేస్తూ కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ బదిలీని నిలుపుకునేందుకు ఉత్తర్వులను వారం రోజుల పాటు నిలిపివేయాలని ఆమె అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. కాగా గత రెండు నెలలుగా ఎంపీడీఓ, ఎంపీపీల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.
ఇదీ చదవండి: 'బంద్'కు తెరాస మద్దతు.. ఆందోళనల్లో ప్రజాప్రతినిధులు