భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమార్తెలు. ఒకరికి ఐదేళ్లు, మరొకరికి ఎనిమిదేళ్లు. ఆమె భర్త కొంతకాలం క్రితమే మరణించాడు. ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్న ఆమె.. సింగరేణి కాలనీకి చెందిన ఓ ఆటో డ్రైవర్‌తో కొంతకాలంగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. పిల్లల ఆలనా పాలనా మరచిపోయింది. ప్రియుడితో కలిసి చిన్నపిల్లలని చూడకండా చిత్రహింసలకు గురిచేస్తోంది.
వెలుగులోకొచ్చిందిలా..
పిల్లలను చూసేందుకు మేనత్త మంగళవారం చుట్టం చూపుగా వచ్చింది. ఒంటి నిండా ఎక్కడ చూసినా కాల్చిన గాయాలు, వాతలు, బెల్టు దెబ్బలను చూసి కడుపుతరుక్కుపోయింది. ఏమి జరిగిందని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అమ్మ మరో వ్యక్తితో కలిసి రోజూ చితకబాదుతున్నారని ఆ చిన్నారులు చెప్పిన తీరు హృదయం ద్రవించేలా ఉంది.
ఈ దారుణాన్ని పిల్లల మేనత్త పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఐదేళ్ల చిన్నారిని బాలల సంరక్షణ అధికారులు పిల్లల ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దర్నీ పట్టణంలోని ఓ అనాథ శరణాలయంలో చేర్చాలని నిర్ణయించారు. పిల్లలు లేక ఎందరో తల్లులు తల్లడిల్లుతుంటే.. ఇలాంటి ఉదంతాలు అమ్మతనానికే మచ్చతెస్తున్నాయి.
ఇదీ చూడండి: సాగర్హిల్కాలనీలో విషాదం.. మహిళ దారుణ హత్య