పోడుభూముల బాధితులకు తాను పూర్తి అండగా ఉంటానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలోని పోడుభూములను ఆయన పరిశీలించారు. కందకాలు తవ్వుతున్న అటవీశాఖ అధికారులకు, సాగుదారులకు మధ్య నాలుగో రోజులుగా వివాదం కొనసాగుతోంది.
ఎన్నో ఏళ్లుగా దాదాపు 500 ఎకారాలను సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడం ఎంతవరకు సమంజసమని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మరోవైపు పోడుదారులకు ఈ భూములపై ఎలాంటి హక్కు లేదని అటవీశాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పోడుభూముల సాగుదారులకు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అటవీ అధికారులు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. తాను కూడా ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని మెచ్చా నాగేశ్వరరావు తెలిపారు.