Mirchi Raithu problems: తామర కొత్త జాతి పురుగుతో.. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి రైతులు పడే గోస అంతా ఇంతా కాదు. పురుగును నిర్మూలించే మార్గం తెలియక తల్లడిల్లుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా.. మిర్చి పంటలో తామర పురుగు ఉద్ధృతంగా వచ్చేసింది. పువ్వును తినేయడంతో.. చాలా చోట్ల కాయలే లేకుండా పోతున్నాయి. తేజ, చపాటా తదితర మేలైన రకం మిర్చి పండించే రైతులదీ ఇదే గోస. కాయలు లేకపోవడం.. ఉన్నా అవి సరైన పరిమాణంలో పెరగకపోవడంతో.. నష్టాలను మూటగట్టుకుంటున్నారు. ఎన్ని పురుగు మందులు కొట్టినా ఫలితం లేకపోవడంతో.. పండించిన చేతులతోనే పంటను పెకిలించి వేస్తున్నారు. ట్రాక్టర్లతో దున్నించేస్తున్నారు.
Tamara insects in warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా లక్షా 50 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేపట్టారు. ఒక్క వరంగల్ జిల్లాలోనే 27 వేల ఎకరాల్లో పంట సాగైంది. గత ఏడాది మిర్చికి అధిక ధరలు రావడంతో ఎక్కువ శాతం మంది రైతులు.. మిర్చి పంట వైపే మొగ్గు చూపారు. లాభాలు రాకపోగా.. తామర పురుగు కారణంగా రైతులంతా మూకుమ్మడిగా నష్టపోయారు. పురుగు నిర్మూలనకు.. ఇప్పటికైనా శాస్త్రవేత్తలు, అధికారులు మార్గం చూపిస్తే.. కనీసం వచ్చే ఏడాదికైనా నష్టాలు తప్పుతాయని అంటున్నారు.