Minister Satyavathi responds over Saakivagu incident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసీగూడెం, సాకివాగు ఘటనపై గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ముగ్గురు ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ బీట్ గార్డులు అమానుషంగా ప్రవర్తించారని ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు మంత్రి ఆదేశించారు. ఈ ఆదేశాలపై స్పందించిన ఉన్నతాధికారులు... విచారణ జరపాలని జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సూచించారు.
ఆదివాసీ మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి సత్యవతి రాథోడ్... మహిళలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అడవిలో జీవనాధారం నిమిత్తం అటవీ ఉత్పత్తుల కోసం వెళ్లే ఆదివాసీల జోలికి వెళ్లొద్దని పలుసార్లు హెచ్చరించామని గుర్తు చేశారు. అయినప్పటికీ కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
ఏం జరిగిందంటే
Forest Officer Attack on tribal women: సాకివాగు గుత్తికోయ గూడెంకు చెందిన నలుగురు మహిళలు గురువారం మధ్యాహ్నం కట్టెల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. వంటచెరుకుగా వినియోగించే కట్టెల కోసం వెళ్లిన మహిళలను.. అటవీ ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఫారెస్ట్ బీట్ అధికారి మహేశ్ అడ్డుకున్నాడు. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ మహిళలను తరిమాడు. ఆ సమయంలో తమపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దుర్భాషలాడారని బాధితులు ఆరోపించారు. తమలో ఒకరిపై చేయి చేసుకున్నారని వాపోయారు. మరో ముగ్గురు పారిపాయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటవీ అధికారి అందులోని ఓ మహిళ వస్త్రాలు లాగగా.. ఆమె బట్టలు ఊడిపోయాయి. అధికారి నుంచి ఎలాగోలా తప్పించుకున్న ఆమె అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్టు చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో మరో మహిళ గోతిలో పడిపోగా.. గాయాలయ్యాయి. మిగిలిన మహిళలు ఆమెను తీసుకుని గుత్తికోయ గ్రామానికి తీసుకొచ్చారు. అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనను మహిళలు భయంతో ఎవరికీ చెప్పుకోలేదు. శుక్రవారం(జనవరి 21న) గ్రామానికి వెళ్లిన ముల్కలపల్లి మండలానికి చెందిన నాయకులతో మహిళలు గోడు వెళ్లబోసుకోగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
సంబంధిత వార్త: Forest Officer Attack: అడవిలో అమానవీయం.. కట్టెల కోసం వెళ్తే వివస్త్రను చేసి..!
ఇదీ చదవండి: Chain Snatcher Arrest in Ahmedabad : హైదరాబాద్ గొలుసు దొంగను అహ్మదాబాద్‌లో పట్టేశారు..