భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూతన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై రైతులకు జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సన్నరకం వరిధాన్యంపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. రైతు బంధు పథకం అందరికీ వర్తించేలా ప్రభుత్వం సూచించిన పంటలనే వేయించాలని ఆయన సూచించారు.
జిల్లాలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని తెలిపారు. రైతులను అధికారులు పూర్తిస్థాయిలో వానాకాలం సాగుపై సమాయత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర రావు, రాములు నాయక్, హరిప్రియ, వీరయ్య, జిల్లా జడ్ఫీ ఛైర్మన్ కోరం కనకయ్య, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.