రాష్ట్రంలో నిరంకుశ పాలనను అంతమొందించేలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల తెలంగాణ జన సమితి ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన ఓవైపు, మరోవైపు వ్యక్తి కుటుంబం యొక్క గుత్తాధిపత్యాన్ని విస్తరించే ప్రయత్నానికి మధ్య ఘర్షణ జరుగుతుందన్నారు. ఈ ఘర్షణలో ప్రజలు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారానికి, హక్కుల సాధన కోసం వివిధ రూపాల్లో పోరాటం జరిగిందన్నారు. ఇకపై ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలు వేదిక కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టడం చట్టవిరుద్ధమని, ఎల్ఆర్ఎస్ను ప్రజలపై బలవంతంగా రుద్దెందుకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ నిలిపివేసిందని చెప్పారు.
ఆస్తి హక్కుపై చట్టం పేర్కొన్న పద్ధతిలో తప్ప పరిమితులు విధించడానికి వీలు లేదన్నారు. చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తిపై రుసుములు చెల్లించాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం అన్యాయమన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం ఎవరు భూములు కలిగి ఉన్నారో వారికి ఆ భూములపై హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన అధికారాన్ని రాజ్యాంగబద్ధంగా ఉపయోగించకుండా ఇష్టానుసారంగా వాడుతుందన్నారు. ఓటు అనే ఆయుధాన్ని వినియోగించి సీఎం కేసీఆర్ స్పందించేలా సమాధానం చెప్పాలని కోరారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్న కోదండరామ్‌కు గిరిజన సంఘాలు మద్దతు తెలిపాయి.
ఇదీ చూడండి : లైవ్ వీడియో: పెద్దవాగులో కొట్టుకుపోయిన ట్రాక్టర్