Telangana Decade Celebrations on Irrigation Day : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు ఊరువాడ ఘనంగా నిర్వహిస్తోంది. ఇవాళ సాగు నీటి దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా స్థానిక ఎమ్మెల్యే హరిప్రియతో పాటు మహబూబాబాద్ జడ్పీ ఛైర్మన్ ఆంగోత్ బిందు, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగల రాజేందర్, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
సీతారామ ప్రాజెక్టు డీపీఆర్ ఆమోదం : ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రగతిని ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో ఇల్లందు నియోజకవర్గానికి ప్రత్యేకించి సీఎం కేసీఆర్ చొరవతో రూ.3వేల 220 కోట్లు డీపీఆర్‌కు త్వరలో మంజూరు కాబోతోందని తెలిపారు. ఇల్లందు మండల రొంపేడు నుంచి టేకులపల్లి మండలం బోడు, బొమ్మనపల్లి వరకు గార్ల, కామేపల్లి మండలాలతో పాటు డోర్నకల్ మండలంలోని సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు.
- Telangana Decade Celebrations 2023 : ఊరూవాడా సంబురం.. అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవం
- Laser Show in Hyderabad : హైదరాబాద్‌లో లేజర్ షో.. 'అదిరింది గురూ' అంటూ కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వాలు నిర్మించి వదిలేసిన చెక్ డ్యామ్‌లు కొత్తగా నిర్మించిన డ్యామ్‌లు ఆంధ్ర ప్రాంతానికి నీరు తరలించేందుకు చేసిన డ్యామ్‌ల రీ డిజైన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి సాగు నీరు తాగునీరు అందేలా కృషి చేసినట్లు గుర్తు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో 46 లక్షల మెట్రిక్ టన్నుల పంటల సాగు జరగగా.. నేడు రెండు కోట్ల 62 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఈ అభివృద్ధితో నేడు దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని హర్షం వ్యక్తం చేశారు.
46వేల 500 చెరువుల పూడిక తీయడం వలన గ్రామాలలో చెరువులు కళకళలాడుతుండడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, దేవాదుల, కొమరం భీమ్, వంటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఈరోజు ప్రాణహిత చేవెళ్ల, రాజీవ్ దుమ్ముగూడెం, శ్రీరామ్ సాగర్, కేంతనపల్లి ప్రాజెక్టులను పూర్తి చేసుకోబోతున్నాయని తెలిపారు. కేవలం సాగునీరు సమస్యనే కాకుండా మంచినీటి సమస్య కూడా తొలగిపోయి చెరువుల జలకళతో ఏర్పాటు చేసిన చేపల ఉచిత చేప పిల్లల పంపిణీతో నీలి విప్లవం (చేపల పెంపకం)లోను రాష్ట్రం ప్రగతి సాధించిందన్నారు.
'దక్షిణాదిలో పీవీ నరసింహరావు తరువాత కేసీఆర్': ఇటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రం నుంచి దేశవ్యాప్తంగా విస్తరించేలా సీఎం కేసీఆర్‌కు ప్రజలు బాసటగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రం నుంచి పీవీ నరసింహారావు తర్వాత మరో నాయకుడు దేశ రాజకీయాల్లో లేరని.. మనమందరం బీఆర్ఎస్కు అండగా ఉంటూ సీఎం కేసీఆర్‌ను ముచ్చటగా మూడోసారి సీఎంను చేసేందుకు సన్నద్ధం కావాలన్నారు.
ఇవీ చదవండి: