బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జోరువానలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రెండు జిల్లాలు తడిసి ముద్దవుతున్నాయి. ఖమ్మం జిల్లాలో సగటు వర్షపాతం 57.1గా నమోదైంది. జిల్లాలోని 16 మండలాల్లో భారీ వర్షంతో పాటు మరో 5 మండలాల్లో అతి భారీ వర్షం కురిసింది. సింగరేణి మండలంలో అత్యధికంగా 121.2 మి.మీ వర్షపాతం నమోదైంది.
కాలనీల్లో భారీగా వరద నీరు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 88.9 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలోని 17 మండలాల్లో భారీ వర్షపాతం నమోదు కాగా.. మరో 2 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఖమ్మం నగరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది.
ఎడతెరిపిలేకుండా...
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఉభయ జిల్లాల్లోని ప్రధాన ప్రాజెక్టులు, జలాశయాలు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఖమ్మంలో మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువవుతోంది. రఘునాథపాలెం మండలం కేవీ బంజర వద్ద నిమ్మ వాగు చెక్ డ్యామ్ ఉప్పొంగుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. 18 గేట్లు ఎత్తి 56 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని, అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
భద్రాచలం గోదారమ్మ ఉద్ధృతం...
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 35 అడుగులకు దాటి నీటి ప్రవాహం ఉరకలెత్తుతోంది.
సీతారామ ప్రాజెక్టుకు అడ్డంకిగా...
ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగుకు వరప్రదాయనిగా పనులు సాగుతున్న సీతారామ ప్రాజెక్టుకు వరుణుడి జోరు అడ్డంకిగా మారింది. వర్షం కారణంగా మూడ్రోజులుగా సీతారామ పనులు ముందుకు సాగడం లేదు. ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అశ్వాపురం మండలంలోని భీమునిగూడెం వద్ద పంప్ హౌజ్లోకి వరదనీరు చేరింది. పంపులు, మోటర్లు వరదనీటిలో చిక్కుకోకుండా సిబ్బంది వరద నీటిని తోడేశారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి...
వర్షాల కారణంగా సింగరేణి బొగ్గు గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఫలితంగా ఒక్కో ఏరియాలో సుమారు 20 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
ఇవీ చూడండి : పరుగులు పెట్టిస్తున్న కలెక్టర్... అలసత్వం వహిస్తే షోకాజ్ నోటీస్