భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వరద పోటెత్తింది. ఏకధాటిగా కొన్ని గంటల పాటు కురిసిన వర్షానికి మణుగూరులోని కట్టు వాగుకు వరద నీరు చేరింది. సుందరయ్య నగర్, మేదరి బస్తీ తదితర ప్రాంతాల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. అర్ధరాత్రి సమయంలో వరద నీరు ఇళ్లలోకి చేరడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు మూడు అడుగుల మేర రహదారులపై వరదనీరు నిలిచాయని స్థానికులు వాపోతున్నారు.
ప్రతి ఏడాది కురిసే వర్షాలకు మణుగూరు పట్టణం జలమయంగా మారటం పరిపాటిగా మారింది. కట్టు వాగులో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించకపోవటం వల్లే వరద నీరు పోటెత్తుతోంది. ప్రధానంగా పట్టణ పరిధిలో ఉన్న కట్టువాగులో పచ్చి రొట్ట, పెద్దపెద్ద వృక్షాలు ఏపుగా పెరిగి ఉన్నాయి. దీంతో వరద నీరు పోయేందుకు ప్రవాహం సక్రమంగా లేక నీరు ఇళ్లలోకి చేరుతోంది. ఇప్పటికైనా పురపాలక అధికారులు స్పందించి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలని పట్టణ వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ స్ఫూర్తిగా నూతన సచివాలయం