Governor Tour: ప్రజలతో మమేకమై.. ప్రజలకు సేవ చేయడమే తమ అభిమతమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజల సమస్యలు తెసుకునేందుకు వారి వద్దకే వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. రెండురోజుల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన నిమిత్తం ఆదివారం ఆమె సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి వేకువజామున భద్రాచలం చేరుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బోగిలో హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ప్రయాణించి, అక్కడి నుంచి వాహనంలో భద్రాచలం చేరారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇవాళ, రేపు రెండు రోజులపాటు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో పర్యటిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పర్యటించడంతోపాటు పలు కార్యక్రమాల్లో పాలుపంచుకుంటారు. మారుమూల గిరిజన గ్రామాలను సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఆదిమ గిరిజన సమూహాలకు చెందిన ప్రజల పోషకాహార స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్ట్‌ను ఆమె ప్రారంభిస్తారని రాజ్‌భవన్ కార్యదర్శి తెలిపారు. కొండరెడ్ల తెగకు చెందిన రెండు దత్తత గిరిజన ఆవాసాలైన పూసుకుంట, గోగులపూడిలో వరుస కార్యక్రమాలను ఆమె ప్రారంభిస్తారు.
ఇవాళ ఉదయం భద్రాచలం దేవస్థానంలో జరిగే శ్రీసీతారామచంద్ర స్వామి పట్టాభిషేక కార్యక్రమానికి గవర్నర్ హాజరవుతారు. ఆ తర్వాత భద్రాచలంలోని వీరభద్ర ఫంక్షన్ హాల్‌లో వనవాసి కళ్యాణ్ ఆశ్రమం ఆధ్వర్యంలో నిర్వహించే గిరిజన మహిళల సంప్రదాయ సీమంతం వేడుకకు కూడా గవర్నర్ హాజరవుతారు. అనంతరం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న రక్తనిధిని సందర్శించి దాని పనితీరును సమీక్షిస్తారు. ఆ తరువాత దమ్మాయిపేట మండలం నాచారం గ్రామం జగదాంబ సహిత జయలింగేశ్వర స్వామి ఆలయాన్నిసందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. రేపు జిల్లాలోని పూసుకుంట కొండరెడ్డి గిరిజన ఆవాసాలను సందర్శించి పూసుకుంట, గోగులపూడి గిరిజనులతో కలిసివారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్‌ను గవర్నర్ సందర్శిస్తారు.
ప్రజలను కలిసేందుకు రైలులో ప్రయాణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి మరోమారు శ్రీరామనవమి శుభాకాంక్షలు. గవర్నర్‌గా ఇది ఒక కొత్త అనుభూతి. -తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
ఇదీ చదవండి: ముల్లోకాలు మురిసేలా రాములోరి కల్యాణం... పులకించిన భద్రాద్రి