ఆదిమ జాతి గిరిజన ప్రజల్లో పోషకాహార లోపాలను సరిదిద్దడానికి గవర్నర్ స్వయంగా చేపట్టిన ప్రత్యేక పోషకాహార కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో వారి అవసరాలు ఎలా ఉన్నాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరా తీశారు. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూసుకుంటకు చెందిన ఆదిమ గిరిజన జాతి కొండారెడ్డి ప్రజలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గవర్నర్ మాట్లాడారు.
పుదుచ్చేరి రాజ్‌నివాస్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దమ్మపేట మండల పరిషత్ కార్యాలయంలో పూసుకుంట సర్పంచ్, జడ్పీటీసీ, అంగన్వాడీ ఆయా, గ్రామ పెద్దలు, అధికారులతో మాట్లాడారు. గిరిజన గ్రామంలో కుటుంబం వారీగా, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి పోషకాహార అవసరాలు, ఇతర అవసరాలు ఏమున్నాయో తెలుసుకోవడానికి సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులకు గవర్నర్ సూచించారు.
సర్వే ఫలితాల ఆధారంగా ప్రతి వ్యక్తికి మేలు చేసే విధంగా అవసరమైన కార్యక్రమాలు చేపట్టనున్నామని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజలు గవర్నర్‌ను తమ గ్రామానికి రావలసిందిగా ఆహ్వానించగా.. వారి అభ్యర్థనకు తమిళిసై సానుకూలంగా స్పందించారు. త్వరలోనే పూసుకుంట గ్రామానికి వస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ ఆరోగ్యం కోసం గవర్నర్ చేపట్టిన పోషకాహార కార్యక్రమాన్ని గిరిజనులు స్వాగతిస్తూ... కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇదీ చదవండి: వైరల్ వీడియో: డబ్బులు ఇస్తామని చాటింపు