Thirukalyana Brahmotsavam: ఏసీతారాముల కల్యాణం కోసం వరి ధాన్యాన్ని గోటితో ఒలిచిన తలంబ్రాలకు.. సోమవారం భద్రాచలంలో శ్రీరామ గాయత్రి మంత్ర హోమం నిర్వహించారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సమితి.. ఈ ఉదయం రామయ్యకు 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలు సమర్పించింది. అన్నదానం కోసం మరో 25 క్వింటాళ్ల బియ్యం విరాళమిచ్చింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతి రామదాసు భక్త బృందం కోదండరాముడిని గోటి తలంబ్రాలను సమర్పించింది.
Goti Talambralu: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సమితి అధ్యక్షుడు కల్యాణ అప్పారావు... తన ఎకరం భూమిని గోటి తలంబ్రాల కోసం కేటాయించారు. అందులో విత్తనాలను మెుదట భద్రాచలంకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. వానర వేషధారణలతో పొలం దున్ని, పొట్ట దశలో శ్రీమంతం చేస్తారు. ఏడాది పాటు పండిన వరి ధాన్యాన్ని వివిధ రాష్ట్రాలకు భక్తులకు పంపించి రామనామ జపం చేస్తూ గోటితో ఒలిచిన తలంబ్రాలను సిద్ధం చేశారు. గోటి తలంబ్రాలను ఆలయం వద్దకు తీసుకొచ్చిన భక్తుల బృందానికి ఈవో శివాజీ స్వాగతం పలికి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోటి తలంబ్రాలను స్వీకరించారు. సీతారాముల కల్యాణంలో ఈ తలంబ్రాలను వినియోగిస్తామని తెలిపారు.
ఈనెల 2న భద్రాద్రిలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆరో తేదీన అంకురార్పణ అనంతరం అభిషేకం, ధ్వజపట లేఖనం, ధ్వజపటం ఆవిష్కరణ జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్ 9 నుంచి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు అయినా ఎదుర్కోలు మహోత్సవం, ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 11న మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈనెల 16న వరకు బహ్మోత్సవాలు జరగనున్నాయి.
శ్రీరామనవమి వేడుకల కోసం 3 లక్షల లడ్డూలను సిద్ధం చేస్తున్నారు. 60 కౌంటర్లలో వీటిని ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ఇవి కాకుండా 2.5 లక్షల ముత్యాల తలంబ్రాల పొట్లాలను ఆర్టీసీ కార్గో, తపాలా శాఖ ద్వారా బుక్ చేసుకున్న వారికి పంపిస్తారు. నేరుగా కౌంటర్లలోనూ విక్రయించనున్నారు.
ఇదీచూడండి: భద్రాద్రి సీతారాముల కల్యాణ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్