భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 55.7 అడుగులకు చేరింది. 53 అడుగుల వద్దనే మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలంలో గోదావరి నీటి మట్టం చివరి ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. రామయ్య సన్నిధి వద్ద గల విస్టా కాంప్లెక్స్ వరద నీటిలో మునిగిపోయింది. అన్నదాన సత్రం కళ్యాణ కట్ట, స్నానఘట్టాల ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగి పోయాయి.
భద్రాద్రి రామయ్య సన్నిధి తూర్పు మెట్లు గోదావరి వరద నీటిలో మునిగాయి. రామాలయం పరిసర ప్రాంతాల్లోని చాలా దుకాణాలు, ఇళ్లు జలమయమయ్యాయి. భద్రాచలంలో కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, రాజుపేట, సుభాష్ నగర్ కాలనీ వంటి దిగువ ప్రాంతాలకు వరద నీరు చేరుతున్నాయి. ఆయా కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
భద్రాచలం చుట్టుపక్కల ప్రధాన రహదారులన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఒడిశా, ఛత్తీస్గడ్ , ఏపీకి వెళ్లాల్సిన భారీ వాహనాలు భద్రాచలంలోనే నిలిచిపోయాయి.
ప్రస్తుతం 55.7 అడుగుల వద్ద ఉన్న నీటి మట్టం ఇంకో నాలుగు అడుగుల వరకు పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే భద్రాచలంతో పాటు చాలా గ్రామాల్లోకి వరద నీరు చేరే అవకాశం ఉంది భావిస్తున్నారు.
భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, మణుగూరు ప్రాంతాల్లో గోదావరి వరద ప్రవాహం గ్రామాల్లోని సుమారు 500 మందిని సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు.
ఇవీచూడండి: గోదావరి ఉధ్దృతిపై మంత్రి అత్యవసర సమావేశం