ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి భారీగా వరద వస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదారమ్మ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈరోజు ఉదయం 6 గంటలకు 51.2 అడుగుల నీటిమట్టానికి చేరింది. అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. నీటిమట్టం 53 అడుగులకు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వదర నీరుతో వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రహదారులపైకి వరద నీరు చేరడం వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
నీటిలో పర్ణశాల
పర్ణశాల 3 రోజుల నుంచి వరద నీటిలోనే ఉంది. సీతమ్మ నారచీరల ప్రాంతంలో గోదావరి ఉగ్రరూపంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ రజత్ కుమార్ శైని అధికారులను ఆదేశించారు. పోలవరం ముంపు మండలాలు వీ ఆర్ పురం, చింతూరు, కుకునూరు, వేలేరుపాడు, ఏటపాకలోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 4 మండలాలకు రాత్రి నుంచి పూర్తిగా బస్సులు నిలిపివేశారు.
ఇదీ చూడండి : బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు