Godavari Karakatta Damaged : గోదావరి మహోగ్ర రూపం దాల్చి.. భద్రాచలం వద్ద పెద్ద ఎత్తున వరద వచ్చినా తట్టుకున్న కరకట్ట.. నీటి ప్రవాహ ఉద్ధృతి కారణంగా అక్కడక్కడ దెబ్బతినడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 1999లో పట్టణానికి చుట్టూ 7.4 కి.మీ పొడవున దీన్ని నిర్మించారు. నాటి నుంచి పదిసార్లు మూడో ప్రమాద హెచ్చరిక (53 అడుగులు) స్థాయి వరదలు వచ్చాయి. కానీ ఈసారి 70 అడుగులకు పైగా వరద రావడంతో కరకట్ట సామర్థ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నీటిమట్టాన్ని కొలిచే స్తంభం సమీపంలో కరకట్ట పైభాగాన నాలుగైదు అడుగుల మేర రివిట్‌మెంట్ ఊడిపోయింది. సిమెంట్ కాంక్రీట్ దెబ్బతిని మట్టిపెళ్లలు చెల్లాచెదురయ్యాయి. రాళ్లు జారిపోవడంతో ఇక్కడ గొయ్యి కనబడుతోంది. ఇది పైకి మాత్రమే ఉందా లేక కట్ట బలహీనపడిందా? అనేది నిపుణులు తేల్చాల్సి ఉంది. స్లూయిస్ మార్గంలో రెండుచోట్ల కట్టకు గోతులు పడటంతో ఇసుక బస్తాలతో నింపారు. పైభాగంలో రెండుచోట్ల కొంతమేర కుంగిపోయింది. సీసీ రహదారి మధ్యలో ఎడం పెరిగి విడిపోయినట్లు మారింది.
మళ్లీ ఇదేస్థాయి వరద వస్తే కరకట్ట ఆగుతుందా? అన్నది ప్రశ్నార్థకం. వెంటనే మరమ్మతులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై నీటిపారుదలశాఖ ఈఈ రాంప్రసాద్‌ను వివరణ కోరగా.. కాలక్రమంలో ఒకటి, రెండు అంగుళాల మేర కరకట్ట కుంగినప్పటికీ ప్రమాదం లేదని అన్నారు. ఒకటో రెండో రాళ్లు జరిగినంత మాత్రాన కరకట్ట బలహీనపడినట్లు కాదని చెప్పారు. వెంటనే నిర్వహణ చర్యలు చేపడుతున్నామని, మళ్లీ వరదొచ్చినా ఎలాంటి ప్రమాదం ఉండదని వివరించారు.