భద్రాచలంలో రెండ్రోజుల క్రితం 61.7 అడుగులతో ఉగ్రరూపం దాల్చిన గోదారమ్మ శాంతించింది. బుధవారం ఉదయం ఉదయం 9 గంటలకు 46.6 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించారు.
వ్యాధులు ప్రబలే సీజన్
నీటిమట్టం తగ్గుతుండటంతో పరివాహకంలో వరద ఉద్ధృతి సృష్టించిన నష్టం క్రమంగా బయటపడుతోంది. రహదారులు ధ్వంసమయ్యాయి. పొలాలు నీట మునిగి పంట పనికిరాకుండా పోయింది. కొన్ని గ్రామాలు ఇప్పటికీ జలదిగ్బంధంలోనే చిక్కుకుని ఉన్నాయి. మన్యంలో వ్యాధులు వ్యాపించే ఈ సమయంలో... దోమలు ప్రబలితే మలేరియా, డెంగీ ప్రబలే అవకాశాలున్నాయి.
నిర్లక్ష్యం తగదు..
తీర ప్రాంతంలోని పలు ఆవాసాలు ముంపు నుంచి ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్నాయి. గోదావరి ఉగ్రరూపం వీడి శాంతించడంతో నీట మునిగిన ఊళ్లు బయట పడుతున్నాయి. వరద తగ్గినప్పటికీ బురద పేరుకుని అపరిశుభ్రత తాండవిస్తోంది. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వకుంటే వ్యాధులు ముప్పేట దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది. అధికారుల సమన్వయానికి ఇదే నిజమైన సవాల్‌గా నిలుస్తోంది. శాఖల వారీగా కేటాయించిన విధులు సక్రమంగా చేయాల్సి ఉంది. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా వరద పోటు కంటే అధికారులు చేసే నిర్లక్ష్యమే బాధితులను నష్ట పర్చే వీలుందని పలువురు సూచిస్తున్నారు.
బఫర్ స్టాక్ పాయింట్లలో సరిపడా బియ్యం నిల్వలు ఉన్నందున తిండికి పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ ఆరోగ్య సమస్యలే కీలకం కానున్నాయి. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు సరిపడా కార్మికులను సిద్ధం చేయాలి. బురద మేటలను తొలగించి బ్లీచింగ్ చల్లించాలి. ఐటీడీఏ పీవో గౌతమ్, ఎస్పీ సునీల్‌దత్, ఇన్‌ఛార్జి సబ్ కలెక్టర్ స్వర్ణలత ముంపు ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించారు. పినపాక, అశ్వాపురం, మణుగూరు, బూర్గంపాడు, చర్ల, వాజేడు, వెంకటాపురం, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల్లో వరద తగ్గినప్పటికీ లోతట్టు కాలనీ వాసులు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. అన్ని చోట్ల వైద్యశాఖ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. నీట మునిగిన ఇళ్ల యజమానులకు తక్షణ పరిహారం చెల్లించాల్సి ఉంది. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్నందున వీటిని వెంటనే బాగు చేయించాలి.