భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి పెరుగుతోన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సౌకర్యాలపై డైరెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి జనరల్ మేనేజర్ పి.వి.సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
కరోనా బారినపడిన సింగరేణి ఉద్యోగులకు వైద్యం అందించడం కోసం ముందస్తుగా ఇల్లందు ఏరియా ప్రధాన ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డు, హోం క్వారంటైన్ కేంద్రాలను అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరించారు. కొవిడ్ సోకిన ఉద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో జీఎం(పర్సనల్) లక్ష్మీనారాయణ, నరసింహారావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.నేరేళ్లు, సెక్యురిటీ అధికారి నందిగామ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.