భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం(బీటీపీఎస్)లో పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. నాలుగో యూనిట్‌లో ఈ నెల 6 నుంచి 72 గంటల పాటు 270 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరగటంతో ‘వాణిజ్య ప్రాతిపదికన విద్యుదుత్పత్తి తేదీ’ (కమర్షియల్ ఆపరేషన్ డే- సీవోడీ)ని నిర్వహించారు. నాలుగో యూనిట్ నుంచి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి చేసి.. గ్రిడ్‌కి అనుసంధానించారు. జెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సచ్చిదానందం సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. వాణిజ్య ఒప్పందంపై జెన్‌కో, టీఎస్ ఎన్పీడీఎసీఎల్, ఎస్పీడీసీఎల్ అధికారులు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా జెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సచ్చిదానందం కేకు కోశారు. 1,080 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బీటీపీఎస్‌లో నాలుగు యూనిట్ల ద్వారా ప్రతి రోజూ 25 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలి ప్లాంటు..
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తరవాత భూమి సేకరించి నిర్మించిన తొలి గ్రీన్‌ఫీల్డ్ విద్యుత్ కేంద్రం- భద్రాద్రి. 2015 మార్చి 21న నిర్మాణ పనులను ప్రారంభించారు. ఒక్కోటి 270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్ల నిర్మాణాన్ని రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) చేపట్టింది. ఇందుకు రూ.10 వేల కోట్ల వరకూ వెచ్చించింది. ఆదిలో కొందరు హరిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా.. స్టే ఇవ్వడంతో చాలాకాలం పనులు నిలిచిపోయాయి. స్టే ఎత్తివేసిన తరవాత పనులను తిరిగి ప్రారంభించినా ఏడాదిన్నరగా కొవిడ్ కారణంగా నత్తనడకన సాగాయి.
గతంలో 3 యూనిట్లలో విద్యుదుత్పత్తికి ‘సీవోడీ’ ప్రకటించినా.. నాలుగో యూనిట్ విషయంలో కాస్త జాప్యం జరిగింది. ఈ యూనిట్ పనులూ ఎట్టకేలకు పూర్తి కావడంతో వాణిజ్య విద్యుదుత్పత్తి ప్రారంభించారు. తమ సిబ్బంది పట్టుదలతో శ్రమించి.. నాలుగో యూనిట్‌ను సీవోడీకి తీసుకొచ్చారని జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు అభినందించారు.
"తెలంగాణ ఏర్పడిన సమయంలో తీవ్రమైన విద్యుత్ కోతలుండేవి. రాష్ట్రాన్ని వాటి నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ కేంద్రాలను కొత్తగా భూమి సేకరించి నిర్మించాలని నిర్ణయించారు. వాటిలో ‘భద్రాద్రి’ పూర్తయింది. యాదాద్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయి" -దేవులపల్లి ప్రభాకరరావు, జెన్‌కో సీఎండీ
ఇదీ చూడండి: