ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరిగింది. గోదావరిలో నీటిమట్టం 43 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక (First Warning At Godavari) జారీ చేశారు. గోదావరిలో కి 9,07,616 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.
బుధవారం ఉదయం 30 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం రాత్రికి నలభై అడుగులకు చేరింది. ఈరోజు ఉదయం 6 గంటలకు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి(First Warning At Godavari) దాటి 43. 50 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43 అడుగులు దాటి ప్రవహించడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక(First Warning At Godavari) జారీ చేశారు. లోతట్టు కాలనీల ప్రజలు, లోతట్టు ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాలర్లు, రైతులు గోదావరి పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లరాదని సూచించారు.
మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలు, వస్తోన్న భారీ వరదతో.. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్కు ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 3.30లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 4.49లక్షల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు 33 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎస్సారెస్పీ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత 1087.4 అడుగుల మేర నీరు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 74.506 టీఎంసీల నీరు నిల్వ ఉంది.