Farmer Problems At Rice Mills : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ధాన్యం సేకరణ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. రెండు జిల్లాల్లో కలిపి సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉంది. ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఖమ్మం జిల్లాలోని 64 మిల్లులకు, భద్రాద్రి జిల్లాలోని 33 మిల్లులకు కేటాయించారు. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో 30 వేలు, భద్రాద్రి జిల్లాలో 9 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించారు.
గత రెండు సీజన్లలో సేకరించిన ధాన్యం నిల్వలతోనే మిల్లులన్నీ నిండిపోయి ఉన్నాయని.. ఈ సారి ధాన్యం తీసుకునే పరిస్థితి లేదని మిల్లర్లు సీజన్ ఆరంభంలోనే అధికారులకు తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలో లక్ష మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో 50 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు అంగీకరించారు. మిగిలిన ధాన్యం తరలించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకున్నారు. ఇలా మిల్లర్లుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండానే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది.
తమ ఇష్టారాజ్యంగా..: అయినా ఉమ్మడి జిల్లాలో కొన్ని మిల్లులు.. నిబంధనలు గాలి కొదిలేసి.. ఇష్టారాజ్యంగా మాయాజాలానికి తెరలేపిన తీరు.. మిల్లర్ల దమననీతికి అద్దం పడుతోంది. చాలా మంది మిల్లర్లు అడ్డదారుల్లో సొంతంగా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా.. ఎలాంటి రికార్డులు నమోదు చేయడం లేదని అధికారుల తనిఖీల్లో తేటతెల్లమైంది.
అక్రమాలను గుర్తించినా చర్యలు తీసుకోవట్లేదు..: ప్రభుత్వం కేటాయించిన కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకోకుండా.. ప్రైవేటుగా ధాన్యం కొనుగోలు చేసి త్వరితగతిన మిల్లుల్లో దింపుకుంటున్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా.. ఎక్కడా రికార్డులు సక్రమంగా పాటించడం లేదు. జిల్లాలో దాదాపు 14 మిల్లులు ఇప్పటి వరకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యమే తీసుకోలేదని అధికారుల తనిఖీల్లో తేలింది. ఇలా చాలా మిల్లుల్లో అక్రమాలు గుర్తించినప్పటికీ కేవలం ఒక్క మిల్లును మాత్రమే అధికారులు సీజ్ చేయడంపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువ మొత్తంలో తరుగు: దీనివల్ల ప్రభుత్వానికి భారీగా చెల్లించాల్సిన సొమ్ముకు ఎగనామం పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు మిల్లర్లు తరుగు పేరిట భారీగా మోసాలకు పాల్పడుతూ అన్నదాతల ఆదాయన్ని తరిగేస్తున్నారు. ధాన్యం తడిసిందన్న నెపంతో.. తూర్పారా పట్టిన ధాన్యానికి కూడా.. ఏకంగా 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం సేకరణలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం తీసుకోకపోతే, ఉపేక్షించేది లేదని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ హెచ్చరించారు.
ఇవీ చదవండి: