Fake News Problem in Bhadrachalam Police : నిజం గడప దాటేలోపు.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టేస్తుందనే నానుడి ఉంది. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు అందించిన తప్పుడు సమాచారం (Fake News ).. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టింది. ఇద్దరు వ్యక్తులు ఉదయం 10 గంటల ప్రాంతంలో భద్రాచలంలోని గోదావరి బ్రిడ్జి పైనుంచి దూకారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్ తన సిబ్బందితో కలిసి వంతెన వద్దకు చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులకు ఒక ద్విచక్ర వాహనం, పక్కన బ్యాగు, వాటర్ బాటిల్, చెప్పులు కనబడ్డాయి.
దీంతో పోలీసులు ఆ ద్విచక్ర వాహనంపై వచ్చిన వారే గోదావరిలో దూకారని సమాచారం రావడంతో.. వారి కోసం అగ్నిమాపక సిబ్బంది, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలతో నదిలో వెతకడం ప్రారంభించారు. వారి ఆచూకీ కోసం గంటపాటు వెతికినా ఎక్కడా లభించలేదు. ఇక్కడే పోలీసులకు ఊహించని ఓ ట్విస్ట్ ఎదురైంది. పోలీసులు (Bhadrachalam Police) వెతికే సమయంలో ఆ ద్విచక్ర వాహనం దగ్గరికి ఓ వ్యక్తి వచ్చాడు. అతనిని పోలీసులు ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.
Fake News : సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం.. వ్యక్తులు, సంస్థలపై తీవ్ర ప్రభావం
ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారపాకకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని.. సారపాక వైపు నుంచి బ్రిడ్జి మీదుగా భద్రాచలం వస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చింది. ఇది గమనించిన యువతి తండ్రి.. వాహనాన్ని, బ్యాగును బ్రిడ్జిపై వదిలేసి.. ఆటోలో కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు చెప్పాడు. ఈ విషయం తెలియని కొందరు వ్యక్తులు వంతెనపైన ఉన్న ద్విచక్ర వాహనాన్ని, ఇతర వస్తువులను చూసి వారు గోదావరిలో దూకినట్లు భావించారు. నదిలో ఇద్దరు దూకినట్లు రూమర్లు సృష్టించారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు.
Whatsapp: 'వాట్సాప్‌పై అవన్నీ వదంతులే.. ఎవరూ నమ్మొద్దు'
ఈ విషయం తమ వద్దకు రావడంతో వెంటనే వారి కోసం వెతకడం ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. కానీ ఇదంతా ఫేక్ అని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని పోలీసులు సూచించారు. ఏం జరిగిందోనని కంగారుపడ్డ భద్రాచలం ప్రజలకు.. ఇది తప్పుడు సమాచారమని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సాధారణ పరిస్థితుల్లో ఇదేమంత విషయం కాకపోయినా.. అదే సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్పుడు ప్రచారం ప్రభావం అధికంగా ఉంటుందనేది అర్థం చేసుకోవాలి. తెలిసో తెలియకో సోషల్ మీడియాలో షేర్ చేసే వార్తలు ఒక్కోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారుతాయని తెలుసుకోవాలి. సమాచారాన్ని చేరవేసేటప్పుడు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరిస్తేనే అందరికీ ప్రయోజనం కలుగుతుంది.
'ప్రధాన మీడియా కంటే సోషల్ మీడియా ప్రభావమే తీవ్రంగా ఉంది'
'నేను బతికే ఉన్నా.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు'.. కోట వీడియో రిలీజ్