భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఆదివాసీ, గిరిజనుల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్, ఐటీడీఏ అధికారులు చొరవచూపాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి సర్సయ్య కోరారు. దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న భూములను సర్వే చేసి ఆదివాసీ పేద రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సీలింగ్ యాక్ట్ ప్రకారం 2,500 ఎకరాలను ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పటి వరకు హద్దులు చూపకపోవటం వల్ల ఆ రైతులకు రైతుబంధు రాలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు.
జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్యే హరిప్రియ సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. పోలీసులు భూస్వాముల ఫిర్యాదులు స్వీకరిస్తున్నారని.. కానీ స్థానిక రైతుల ఫిర్యాదులు స్వీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.