జోగులాంబలో..
గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్మామి ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు సాగుతున్నాయి. అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలతో.... మంగళ వాయిద్యాల మధ్య వెళ్లి స్వామి వారి ఆనతి స్వీకరించారు. అనంతరం యాగశాల వద్ద గణపతి పూజ నిర్వహించారు. శైలపుత్రి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
బాసరలో..
నిర్మల్ జిల్లా బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శైలపుత్రి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు.... కట్టెపొంగలి నైవేద్యంగా సమర్పించారు. సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని అయ్యప్ప ఆలయంలో అమ్మ వారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలతో విశేష అలంకరణ చేశారు.
ఉమ్మడి వరంగల్‌లో
ఓరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళీ అమ్మవారి దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిస్తున్నారు. అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. బాలా త్రిపుర సుందరి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి పోటెత్తారు.
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సుప్రసిద్ద వేయి స్తంభాల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మతో కలిసి ప్రారంభించారు. మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో దర్శనమిచ్చారు.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో శ్రీ దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఆలయంలో శ్రీ శుభానందదేవి, సరస్వతి దేవిలకు నవరాత్రులు నిర్వహిస్తున్నారు. పూర్ణభిషేకం, స్వస్తి పుణ్యవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధన, నవగ్రహ, రుద్ర, నమక చమక చండీ హోమం చేశారు. అమ్మవార్లు శైలి పుత్ర అవతారంలో దర్శనమిచ్చారు.
ఉమ్మడి ఖమ్మంలో..
భద్రాద్రి రామయ్య సన్నిధిలో లక్ష్మి తాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. సంతానలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
ఖమ్మంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారు పలు ఆలయాల్లో బాలత్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయం, రాజరాజేశ్వరీ అమ్మవారి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు.
బషీర్‌బాగ్‌లో..
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని శ్రీ కనకదుర్గా నాగలక్ష్మి అమ్మవార్ల శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీంతో ఆలయం ఉత్సవ శోభ సంతరించుకుంది.ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాలా సందర్భంగా... దేవస్థానాన్ని అందంగా అలంకరించారు. అమ్మవార్లను పువ్వులు, నిమ్మకాయలతో అలంకరించడంతో పాటు... దేవస్థానం లోపల వివిధ రకాల పండ్లు, అరటి కొమ్మలు, తోరణాలతో అలంకరణ చేశారు.
జగిత్యాలలో..
జగిత్యాల జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. దుర్గాదేవిని పుర వీధుల్లో ఊరేగించారు. శోభయాత్ర అనంతరం అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు.
ఇవీ చూడండి: