Need help to Disabled: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామానికి చెందిన నాగేశ్వరరావు శారద దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె బత్తిని శ్రీదేవికి పుట్టుకతోనే పోలియో సోకింది. రెండు కాళ్లు ఎడమ చేయి మొత్తానికే పనిచేయవు. పెద్దమ్మాయికి వివాహం జరగడంతో ఆమె వేరే గ్రామంలో ఉంటుంది. చిన్నప్పటి నుంచి శ్రీదేవిని తల్లిదండ్రులు కంటికిరెప్పలా కాచుకున్నారు. ఉన్నదాంట్లోనే తనను పోషించారు. రేకులతో నిర్మించుకున్న తాత్కాలిక ఇంటిలో ఉంటూ.. ఎన్ని కష్టాలెదురైనా శ్రీదేవిని చూసుకున్నారు.
తోడులేక.. సాయం అడగలేక..
అన్ని వేళలా తమ కూతురిని జాగ్రత్తగా కాపాడుకుంటున్న ఆ తల్లిదండ్రులు అనారోగ్యం బారిన పడ్డారు. కడుపేదరికంలో ఉన్న వాళ్లకు సరైన చికిత్స అందక.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఇద్దరు కన్నుమూశారు. తల్లిదండ్రులిద్దరు మృతి చెందటం వల్ల శ్రీదేవి ఒంటరైపోయింది. నడవలేని స్థితిలో ఉన్న శ్రీదేవి అలనాపాలన చూసుకునేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదు. ఉన్న ఒక్క అక్క.. వేరే ఊర్లో తన సంసారం, పిల్లలతో తీరికలేకుండా ఉండటం వల్ల శ్రీదేవిని పట్టించుకునేవారు కరవయ్యారు. ఇక అనాథలా జీవితం గడుపుతోంది. ఈ పరిస్థితిలో తలుపులు కూడా లేని రేకుల ఇంట్లో ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. శ్రీదేవి బతుకిడుస్తోంది. కనీసం అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న శ్రీదేవి.. తన పనులు చేసుకోలేక ఎవరిని సాయం అడగలేక.. నరకం చూస్తోంది. ఎన్ని కష్టాలెదురైనా.. మనోధైర్యం కోల్పోకుండా జీవనం సాగిస్తోంది. శ్రీదేవి కష్టం చూడలేక.. చుట్టుపక్కల వాళ్లు చిన్నచిన్న పనులు చేసిపెడుతూ.. సాయపడుతున్నారు.
ఆదుకోవాలని విజ్ఞప్తి..
ప్రభుత్వం అందించే దివ్యాంగుల పింఛన్ మాత్రమే తనకు ఆధారం. ఆ వచ్చే 3 వేల రూపాయలు.. నిత్య అవసరాలు, మందుల ఖర్చుకు కూడా సరిపోవడం లేదని వాపోతోంది. ఎప్పుడు కూలుతుందో తెలియని రేకులషెడ్డులో తలుపులు కూడా లేకుండా ఉంటున్నాని.. ప్రభుత్వం దయతలచి నివాస సదుపాయం కల్పించాలని శ్రీదేవి వేడుకుంటోంది. ఒంటరిగా బతుకీడుస్తోన్న తనకు ప్రభుత్వమే ఓ దారి చూపించాలని శ్రీదేవి కోరుకుంటోంది.
ఇదీ చూడండి: