Godavari Flood Effect : గోదావరి వరదలు కాస్త శాంతించాయి. ఇప్పుడిప్పుడే ఇళ్ల బాట పడుతున్న ముంపు గ్రామాల బాధితులు ఇళ్లను శుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వరదతోపాటు పాములు, తేళ్లు, మొసళ్లు రావడం గమనించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాకలో పొలం పనులకు వెళ్లిన రైతులు బురదలో మొసలి పిల్ల చిక్కుకోవడం గమనించారు.
పొలంలో బురదలో ఇరుక్కుని ఎటు వెళ్లాలో తెలియక తికమకపడుతున్న మొసలి గురించి రైతులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న జంతు సంరక్షణ అధికారులు పంట పొలంలో ఉన్న మొసలిపిల్లను పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో నెహ్రూ జంతు ప్రదర్శనశాలకు తరలించారు.
వరద ప్రవాహంలో ఇలా పాములు, మొసళ్లు కొట్టుకువచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వీటిని గుర్తిస్తే చంపకుండా.. తమకు సమాచారం అందించాలని కోరారు.