గిరిజనులు, ఆదివాసీలు, గిరిజనేతరుల జీవనాధారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కత్తి కట్టాయని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు ఆరోపించారు. అటవీ హక్కుల చట్టం ఉల్లంఘిస్తూ పట్టాలు ఉన్న భూముల్లో కందకం పనులు చేస్తూ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మార్చి 1న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని రాజకీయాలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై హరితహారం పేరిట ఆదివాసీ గిరిజనులకు భూములు దూరం చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
అటవీ, రెవెన్యూ, పోలీసు శాఖలను ప్రేరేపిస్తూ పోడు భూముల్లో కందకం పనులు చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న 80 రకాల ఖనిజ సంపదను దోచుకునేందుకు హరితహారం పేరిట భూములు లాక్కొని కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
ఇదీ చూడండి: 'మీడియా వారు పరిశీలించి సీఎంకు చెప్పండి'