భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలో 2016 ఫిబ్రవరి 16న ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టులో భాగంగా రోళ్లపాడు ప్రాజెక్టు కోసం శంకుస్థాపన చేశారని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవునూరి మధు తెలిపారు. ప్రస్తుతం రోళ్లపాడు నుంచి కాకుండా సత్తుపల్లి ప్రాంతానికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తూ ఈ ప్రాంత ఏజెన్సీ గ్రామాలకు అన్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన ఆరోపించారు. 2016లో ఎనిమిది వేల కోట్లతో సీతారామ ప్రాజెక్టును ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 24 మండలాలకు నీటిని సరఫరా చేసే విధంగా రూపొందించారు. ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా 2018 సంవత్సరంలో డిజైన్ మార్పు చేసి బడ్జెట్ను ఎనిమిది వేల కోట్ల నుంచి రూ. 13 వేల 388కోట్లకు పెంచనిట్టు వివరించారు.
ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన రోళ్లపాడులోనే మొదట అనుకున్న విధంగా, అన్ని ప్రాంతాలకూ లబ్ధి చేకూరేలా ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. అనుమతులు రాలేదన్న నెపంతో నిర్లక్ష్యం చేయెుద్దని, ప్రభుత్వం తలచుకుంటే అటవీశాఖ, ఇతర అనుమతులు కష్టసాధ్యం కావన్నారు. 2019లోనే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చిందని, దీనిపై ప్రభుత్వ తీరు మారకుంటే ఈనెల 12 నుంచి నిరసన కార్యక్రమం చేపడతామని సీపీఐఎంఎల్ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐఎంఎల్ డెమోక్రసీ నాయకులు సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు, సారంగపాణి పాల్గొన్నారు
ఇవీ చూడండి: కాలువ నిర్మాణ పనులు పరిశీలించిన హరీశ్ రావు