పోడు సాగు దారులపై ప్రభుత్వం జరిపిన దాడులను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ చర్య శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు ఉందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం, బొజ్జ తండాలో గత 60 సంవత్సరాల నుంచి... 300 ఎకరాలలో 125 మంది పోడు సాగుదారులు పొట్ట పోసుకుంటున్నారని చాడ తెలిపారు. దీనిలో కూడా 36 మంది పట్టాలను కలిగి ఉన్నారని... అటవీశాఖ, పోలీస్ అధికారులు వారి పంటపై కన్నేసి నాశనం చేశారని మండిపడ్డారు. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు.
దాదాపు ఎస్సీ,ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన భూమి లేని నిరుపేదలే పోడు సాగు చేసుకుని బ్రతుకుతున్నారని... వారి బతుకులు బజారుపాలు చేయవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు సాగు దారులపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తుందని... తక్షణమే అలాంటి ఆలోచన విరమించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన హామీ ప్రకారం పోడు సాగు దారులందరికీ పట్టాలు ఇవ్వాలని చాడ డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: Murder: ఇబ్రహీంపట్నం ఎంపీటీసీ మమత భర్త రాజారెడ్డి హత్య