నిర్బంధాలతో నిరంకుశ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై.. ప్రజలు తిరగబడాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. తెగింపు, ఉద్యమాలతోనే పాలకులను బుద్ధి చెప్పాలని హితవు పలికారు. పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి.. కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతులను కన్నీళ్లు పెట్టింస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ.. సీపీఐ, అనుబంధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. లక్ష్మీదేవిపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ యార్డు నుంచి ప్రధాన కేంద్రాల మీదుగు కలెక్టరేట్ వరకు చేరుకొని రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఉప్పెనలా కదిలిన ఎర్రసైన్యం, పేద వర్గాలు.. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం జరిగిన సభలో సాంబశివరావు మాట్లాడారు.
రైతులను కన్నీళ్లు పెట్టిస్తోంది
ఏడున్నరేళ్ల స్వరాష్ట్ర పాలన.. తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిల్చింది. పోరాడి సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కి కేసీఆర్ ప్రభుత్వం పోడు రైతులను కన్నీళ్లు పెట్టింస్తోంది. అనాదిగా సాగుచేసుకుంటున్న పోడు భూములను పేదల నుంచి వేరు చేసేందుకు కేసీఆర్ నిర్బంధాలు ప్రయోగిస్తూ.. అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడుతున్నారు. జిల్లాలో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా వందలాది మంది రైతులు మనుగడ కోల్పోతున్నారు. పరిహారం చెల్లించకుండా బలవంతంగా భూసేకరణకు పాల్పడుతున్నారు. -కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి
పచ్చని పంట పొలాలను ధ్వంసం చేస్తూ జరిగే అభివృద్ధి అవసరమా అని ప్రభుత్వాన్ని కూనంనేని ప్రశ్నించారు. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.25 లక్షల పరిహారం చెల్లించే వరకు భూములు అప్పగించబోమని స్పష్టం చేశారు.
వేలం వేయడం అన్యాయం
మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ ప్రజాధనాన్ని, దేశ సంపదని వారిపరం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా విమర్శించారు. రైతుల పాలిట గుదిబండలా మారిన నూతన సాగు చట్టాలు, విద్యుత్ సంస్కరణల చట్టం రద్దు కోసం యావత్ దేశ ప్రజలు ఉద్యమిస్తుంటే.. ఆ ఉద్యమాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ప్రజలు భూమికోసం పోరాడుతుంటే పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను వేలం వేస్తూ ఖజానాను నింపుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమైందని మండిపడ్డారు.
తిరుగుబాటు తప్పదు
దళితులు, గిరిజనులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య అభిప్రాయపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోని పక్షంలో ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ర్యాలీలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మిర్యాల రంగయ్య, బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, గుత్తుల సత్యనారాయణ, కల్లూరి వెంకటేశ్వర్లు, సరెడ్డి పుల్లారెడ్డి, కె.సారయ్య, ప్రజా సంఘాలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఉద్యోగాల పేరుతో మరోసారి యువతను మోసగించే కుట్ర'