కన్నులారా కోదండరాముని కల్యాణం తిలకించేందుకు భక్తకోటి వేచిచూస్తున్న వేళ.. కరోనా మహమ్మారి ఆ ఆశను చిదిమేసింది. ఏటా అడుగడుగునా జయజయధ్వానాలు.. రామనామ స్మరణల మధ్య జరిగే సీతారాముల కల్యాణ వేడుక ఈసారి నిరాడంబరంగానే నిర్వహించనున్నారు. కేవలం వైదిక పెద్దల సమక్షంలోనే దశరథ రాముడు ఓ ఇంటివాడు కానున్నాడు.
కల్యాణానికి వేలాది మంది వచ్చే అవకాశం ఉండడం.. కరోనా విజృభిస్తుండడం వల్ల కల్యాణ వేడుక సాదాసీదాగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రామయ్య పెళ్లి వేడుక నిరాడంబరంగా నిర్వహించాల్సి రావడం చరిత్రలో ఇది రెండోసారని పండితులు తెలిపారు.
రాములోరి కల్యాణానికి ఏటా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి లేదా.. దేవాదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈసారి కరోనా రక్కసి మూలానా ఆలయ అధికారులే ఆ తంతు నిర్వహించనున్నారు.
చరిత్రలో ఇది రెండోసారి..
భద్రాద్రిలో సీతారాముల కల్యాణం సాదాసీదాగా నిర్వహించడం చరిత్రలో ఇది రెండోసారి. 1674లో భక్త రామదాసు భద్రాద్రి రామాలయాన్ని నిర్మించారు. నిత్యం స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించేవారు. అనంతరం కాలంలో ఔరంగజేబు హాయాంలో అతని సైన్యాధికారి ధంసా.. ఆలయాలపై దాడులు చేస్తున్న క్రమంలో ఆ ప్రభావం రామాలయంపై పడింది. 1769లో కల్యాణ మూర్తులను పగులగొట్టాలని వారు భద్రాచలం వచ్చినట్లు ప్రచారంలో ఉంది. ఈ సమయంలో విగ్రహాలను గోదావరి వద్ద దాచిపెట్టగా అప్పుడే సీతమ్మ విగ్రహం మాయమైందట. ఆ సమయంలోనే శ్రీరామనవమికి సీతమ్మ వారి ఉత్సవ విగ్రహం లేకపోవడం వల్ల మూలవిరాట్‌కు వార్షిక కల్యాణం చేశారని పండితులు తెలిపారు.
ప్రధాన ఆలయంలో కల్యాణం నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా మండపానికి తీసుకొచ్చే సంప్రదాయం 1964లో మొదలైందని పండితులు వివరించారు. ఆ తరువాత మళ్లీ మిథిలా మండపంలో కాకుండా ప్రధాన ఆలయంలో కల్యాణం నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం చరిత్రలో ఇది రెండోసారి.
టికెట్ విక్రయాల నిలిపివేత..
50 క్వింటాళ్ల బియ్యంలో ఒక క్వింటా ముత్యాలు కలిపి తలంబ్రాలు తయారుచేస్తున్నారు. ముత్యాలు లేని 6 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను భక్తుల కోసం తయారుచేస్తున్నారు. 10 చోట్ల స్వాగత ద్వారాల ఏర్పాటు తుదిదశకు చేరుకోగా.. ఆలయానికి రంగులు, విద్యుత్ దీపాలంకరణ చివరిదశకు చేరాయి. చలువ పందిళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత పరిణామాలతో టికెట్ల విక్రయాలు నిలిపి వేశారు.
ఏప్రిల్ 2 జరిగే సీతారాముల కల్యాణం కోసం దాదాపు 15 రోజుల నుంచే మొదలైన పనులు ప్రభుత్వ నిర్ణయంతో నిలిపివేశారు. ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల మేర జరిగిన పనులు నిరూపయోగంగానే మారనున్నాయి. అసలే ఆదాయం లేక కష్టాల్లో ఉన్న భద్రాద్రి రామాలయానికి కరోనా వైరస్ మరింత గండికొట్టింది.
ఇవీచూడండి: భద్రాద్రి రామయ్యపై కరోనా ప్రభావం.. భక్తులు లేకుండానే కల్యాణం