రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం సహకార సంఘంలో మాత్రం ఈ సందర్భంగా ఎలాంటి హడావిడి కనిపించలేదు. సంఘంలో మొత్తం 40 మంది ఓటర్లు మాత్రమే ఉండటం ఇందుకు కారణం. సహకార ఎన్నికల చట్టంలోని 22 (బి) ప్రకారం 50 కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్న సంఘాలకు ఎన్నికలు బ్యాలెట్ విధానంలో కాకుండా.. చేతులెత్తే పద్ధతిలో నిర్వహిస్తారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ సూచన మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహకార అధికారులు శనివారం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం 15వ తేదీన నామినేషన్లు స్వీకరించి.. అదే రోజు పరిశీలన, ఉప సంహరణ, ఎన్నికల నిర్వహణ, ఫలితాలను ప్రకటిస్తారు.
ఇదీ అసలు సంగతి..
2005 వరకు మొత్తం 71 గ్రామాల పరిధిలో విస్తరించి ఉన్న భద్రాచలం సహకార సంఘంలో మొత్తం 3500 మంది ఓటర్లు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత దాని పరిధిలోని గ్రామాలన్నీ ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి. ప్రస్తుతం భద్రాచలం పట్టణం మాత్రమే ఆ సహకార సంఘంలో కొనసాగుతోంది. స్థానికంగా వ్యవసాయ భూములు ఉన్న రైతులు 60 మంది మాత్రమే ఉండగా.. వారిలో 40 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంది.
ఇదీ చూడండి: 'కరోనా సోకకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం'