దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం కార్యాలయంపైకి రాళ్లు రువ్విన ఆందోళనకారులు అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయం పైకి ఎక్కి ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలో ఇవాళ కాంగ్రెస్ నిర్వహించిన దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా కార్యక్రమం సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.
తమ మద్దతుతో ఎమ్మెల్యేగా గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు తెరాసలో చేరటాన్ని కార్యకర్తలు తప్పబట్టారు. తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కార్యాలయంపై కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కార్యాలయం వద్దకు చేరుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు చేసిన ఈ దాడిని తెరాస నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఇదీ చూడండి: Saidabad Rape Case: సైదాబాద్ ఘటనపై స్పందించరా..? కేసీఆర్, కేటీఆర్ ఎక్కడికి పోయారు?: కోమటిరెడ్డి