CM KCR Visit: భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు మూడు షిఫ్టులుగా పనిచేయాలని సూచించారు. ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఐటీడీఏ గెస్ట్‌హౌస్‌లో మంత్రులు ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీఎత్తున వర్షాలు వచ్చినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్న అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు.
భద్రాచలం పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హెలీకాప్టర్లో నేరుగా ఏటూరునాగారం చేరుకున్నారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు ఏరియల్ సర్వే నిర్వహించారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని అధికారులతో కలిసి పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని వీక్షించారు. హెలికాప్టర్లోనే ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు సీఎం చేరుకున్నారు.
సీఎం కేసీఆర్‌కు మంత్రి సత్యవతి రాఠోడ్ స్వాగతం పలికారు. వాజేడు మండలం పూచూరు సమీపంలో ఉన్న హెలిప్యాడ్ పాయింట్ వద్ద దిగిన కేసీఆర్.. ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్లారు. సీఎంతో మంత్రులు, తెరాస నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. పుష్కరఘాట్ వవరకు వెళ్లి అక్కడి పరిస్థితిని సీఎంకు సీతక్క వివరించారు. అనంతరం.. వరద ప్రవాహం తగ్గాలని గోదావరికి సీఎం కేసీఆర్ సారె సమర్పించి.. శాంతి పూజలు నిర్వహించారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులతో కలిసి గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వరద ముంపు ప్రాంతాల బాధితులను పరామర్శించారు. అక్కడి పరిస్థితులపై వారిని అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి వారికి అందుతున్న సహకారం, పునరావాస ఏర్పాట్లపై ఆరా తీశారు. అటు తర్వాత.. సమీక్ష నిర్వహించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను దశలవారీగా ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. విద్యుత్ సౌకర్యాన్ని యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలన్నారు. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలు మాత్రమే చేపట్టాయని.. ఎన్ని నిధులు ఖర్చయినా సరే శాశ్వత నిర్మాణాలు చేపట్టాలన్నారు. వరద ముప్పు తొలగిపోయే వరకు ములుగులో ఒకటి, భద్రాచలంలో మరొక హెలీకాప్టర్‌ను సిద్ధంగా ఉంచుతామన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుద్ధ్య పనులను చేపట్టాలని సూచించారు. అందరం ప్రజల కోసమే పనిచేయాలని.. ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దని అధికారులకు కేసీఆర్ తెలిపారు. ములుగు జిల్లా కేంద్రానికి బస్‌డిపోను సీఎం మంజూరు చేశారు. పక్కాపూర్ గ్రామ అభివృద్ధికి 50 లక్షలు మంజూరు చేశారు. శ్యాంపల్లి ఆర్ అండ్ బీ రోడ్డు పనులను సత్వరమే చేపట్టాలని ఆదేశించారు.
"వరద తక్షణ సహాయం కింద ములుగు జిల్లాకు రెండున్నర కోట్లు, భద్రాచలం జిల్లాకు రెండు కోట్ల 30 లక్షలు, భూపాలపల్లి జిల్లాకు 2 కోట్లు, మహబూబాబాద్‌కు కోటిన్నర మంజూరు చేస్తున్నాం. వరద ప్రాంతాల్లో పనులు చేసేందుకు ఎలాంటి నిధుల కొరత లేదు. నిధులు ఎక్కువ ఖర్చయినా సరే.. నాణ్యమైన పనులు చేపట్టాలి. వరద పరిస్థితులపై భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే విధంగా నీటిపారుదల శాఖ అధికారులు ప్రత్యేకంగా ఒక బుక్‌ను తయారు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పాత బ్రిడ్జిలు, కాజ్‌వేలు, కల్వర్టులను వెంటనే మరమ్మతు చేయాలి. ఏజెన్సీ ఏరియాలో అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలి. మనందరం ప్రజల కోసమే పనిచేయాలి. ఏ ఒక్కరినీ ఏమీ అనవద్దు. పనుల పేరు మీద ప్రజలను అటవీశాఖ అధికారులు ఏమాత్రం ఇబ్బంది పెట్టవద్దు. మిషన్ భగీరథ పైపులు చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. వాటికి తక్షణమే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది." - సీఎం కేసీఆర్
అనంతరం.. ఏటూరునాగారం నుంచి సీఎం కేసీఆర్ హనుమకొండకు వెళ్లారు. ఇవాళ రాత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో రాత్రి బస చేస్తారు. రేపు కూడా వరద ప్రాంతాల పరిశీలనకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు.
ఇవీ చూడండి: