BRS Public Meeting at Kothagudem Today : 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కాని పనులు.. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందని బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) తెలిపారు. సమైక్య రాష్ట్రంలో ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదన్నారు. కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో సీఎం కేసీఆర్ పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు.
ఎన్నికలు వచ్చాయంటే బూతులు తిట్టుకుంటున్నారని.. అబద్ధాలు చెబుతుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో అభ్యర్థి గుణగణాలు చూసి ఓటేయాలని కొత్తగూడెం ఓటర్లను కోరారు. అభ్యర్థి వెనుక ఉన్న పార్టీ.. ఆ పార్టీ వైఖరి.. చరిత్ర చూసి ఓటేయాలని సూచించారు. రాష్ట్ర విభజన(Andhra Pradesh Bifurcation)లో కాంగ్రెస్ వైఖరి వల్లే.. కేంద్రానికి 49 శాతం అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి నష్టాల్లో ఉండేదన్నారు. తెలంగాణ వచ్చిన వెంటనే 3 శాతం ఇంక్రిమెంట్ ఇచ్చామని గుర్తు చేశారు.
దీపావళి తర్వాత సీఎం కేసీఆర్ మూడో విడత ఎన్నికల ప్రచారం - ఈసారి ఏకంగా రోజుకు 4 నియోజకవర్గాల్లో సభలు
BRS Praja Ashirvada Sabha at Kothagudem : రాష్ట్ర విభజన జరగక ముందు కాంగ్రెస్(Congress) హయాంలో సింగరేణి కంపెనీ టర్నోటర్ రూ.11 వేల కోట్లుగా ఉండేదని.. అదే బీఆర్‌ఎస్ హయాంలో కంపెనీ టర్నోవర్ రూ.30 వేల కోట్లకు చేరుకుందని హర్షించారు. సమైక్య రాష్ట్రంలో ఉంటే కొత్తగూడెం జిల్లా వచ్చేది కాదని స్పష్టం చేశారు. కొత్తగూడేనికి ప్రభుత్వ వైద్య కళాశాల వచ్చిందని చెప్పారు. ఈ నియోజకవర్గంలో 13,500 ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చామని పేర్కొన్నారు. సీతారామా ప్రాజెక్టు 70 శాతం పనులు పూర్తి అయ్యాయని.. వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే.. అందువల్ల తానే వచ్చి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
"ఏ పార్టీ ఎవరి గురించి ఏం చేసింది అనేది ఆలోచించి ఓటేయాలి. ఎవరో చెప్పారని ఓటేస్తే.. చాలా గందరగోళ పరిస్థితులు వస్తాయి. ఆ పరిణతి రావాలని తెలంగాణ బిడ్డగా కోరుతున్నాను. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా వచ్చింది. కాంగ్రెస్ పరిపాలనలో సింగరేణి గనులు నష్టాల్లో ఉండేవి. మూడు శాతం తెలంగాణ రాష్ట్రం ఇంక్రిమెంట్ ఇచ్చాము. డిపెండెంట్ ఉద్యోగాలు ఊడగొట్టిందే కాంగ్రెస్.. సీపీఎం, సీపీఐ యూనియన్‌లు. ఇంటి నిర్మాణానికి సింగరేణి కార్మికులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నాము." - కేసీఆర్, బీఆర్‌ఎస్ అధినేత
BRS Election Campaign at Kothagudem : విద్య, వైద్య, రవాణా, రోడ్లు, మంచినీరు, కరెంటు రంగంలో తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందని సీఎం కేసీఆర్ వివరించారు. కేసీఆర్‌ను చూసి ఈసారి కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలు వనమా వెంకటేశ్వరరావుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వనమా మంచి వ్యక్తి.. వ్యక్తిగత పనుల గురించి ఏ రోజు తనను అడగలేదని కేసీఆర్ కితాబిచ్చారు.