Bhadradri Prasadam Scam Update : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో భక్తులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తున్న వంటశాల నిర్వాహకుడిపై 'పక్కదారి పడుతున్న భద్రాద్రి రామయ్య ప్రసాదం..' పేరుతో ఈటీవీ భారత్లో కథనం ప్రచురితమైంది. దీనిపై భద్రాచలం ఆలయ ఈవో శివాజీ స్పందించారు. ఈ విషయంపై విచారణ జరిపిన అనంతరం ఈవో శివాజీ.. వంటశాల నిర్వాహకుడు నరసింహాచార్యులకు మెమో జారీ చేశారు. పక్కదారి పడుతున్న ప్రసాదంపై 24 గంటలలోపు సమాధానం చెప్పాలని మెమో జారీ చేసినట్లు శివాజీ తెలిపారు.
చర్యలు తీసుకుంటాం..
'గతంలో ఆలయ అన్నదాన సత్రానికి దాతగా ఉన్న వాళ్లలో ఒకరు ఫోన్ చేసి ప్రసాదం తీసుకురమ్మని అడగడంతో మా సిబ్బంది తీసుకెళ్లారు. ఈ విషయం మా దృష్టికి రాగానే మేం మా సిబ్బందికి మెమో జారీ చేశాం. దీనిపై విచారణ జరిపాం. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని చెప్పాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం.'
- శివాజీ, ఆలయ ఈవో
అసలేం జరిగిందంటే..
Prasadam Scam In Bhadradri : గత కొంతకాలంగా భద్రాచల రామయ్య ప్రసాదం పంపిణీలో నిర్లక్ష్యం జరుగుతోంది. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదం.. కొంతసేపటికే అయిపోతుంది. భక్తులు అడిగితే ప్రసాదం అయిపోయిందని.. తీర్థం పోస్తున్నారు. స్వామివారి క్షేత్రంలో.. స్వామివారికి ప్రీతిపాత్రమైన ప్రసాదం.. తమకు దక్కకపోవడంతో భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్రసాదం ప్రైవేటు వ్యక్తుల ద్వారా పక్కదారిన మళ్లిస్తున్నారనే ఆరోపణలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఆదివారం ఉదయం సమయంలో ఓ వ్యక్తి సుమారు పది కిలోల చక్కెర పొంగలి, పులిహోర ప్రసాదాన్ని తీసుకెళ్తున్నదృశ్యం ఈటీవీ భారత్ కెమెరా కంటపడింది. ఇంత ప్రసాదం ఎవరిచ్చారు.. ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించగా.. వంటశాల సిబ్బందికి వెయ్యిరూపాయలు చెల్లించి తీసుకెళ్తున్నట్లు ఆ వ్యక్తి చెప్పాడు.
అయితే ప్రసాదానికి సంబంధించి డబ్బులు చెల్లించి రశీదు తీసుకోలేదని ప్రసాదం కౌంటర్ సిబ్బంది తెలిపారు. దీనిని బట్టి ప్రసాదం కోసం కౌంటర్లో డబ్బులు చెల్లించకుండానే.. ఆలయ వంటశాల సిబ్బంది చేతివాటం ప్రదర్శించి ప్రసాదాన్ని పక్కదారి పట్టిస్తున్నట్లు తేటతెల్లమైంది. ఈ తతంగం జరిగిన గంట సేపటికి కౌంటర్లో రూ.900 చెల్లించి ప్రసాదం కోసం టికెట్టు పొందినట్లు ఆలయ అధికారులు సృష్టించారు.