Bhadradri Temple News : దేవదేవుడైన భద్రాచలం రామయ్యకు, సీతమ్మకు 10న జగత్కల్యాణం ఉండడంతో ఈ క్రతువు నిమిత్తం బుధవారం కోవెలలో చేసిన అంకురార్పణ పూజలు భక్తులను ఆధ్మాత్మిక సంద్రంలో తేలియాడించాయి. భజనలు, కీర్తనలతో మాడవీధులు రామమయమై సాక్షాత్కరించాయి. గోమాత పూజలు భక్తిభావాలు వెల్లివిరిసేలా సాగాయి. రెండేళ్ల కరోనా కష్టాల తర్వాత కల్యాణ క్రతువును ఘనంగా చేస్తుండటంతో భక్తులు పులకించిపోయారు.
కనుల పండువగా వేడుక.. ప్రధాన కోవెలలో రాములవారికి సుప్రభాతం పలికి నామార్చన చేసి ఆరాధించారు. అర్చకులు రాముణ్ని ప్రత్యేకంగా అలంకరించారు. స్థానాచార్యులు స్థలసాయి, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్ ఆధ్వర్యంలో రామస్వరూప్ ఆచార్యులుగా వ్యవహరించి మూల విరాట్ వద్ద ఉత్సవానుజ్ఞ తీసుకున్నారు. తీర్థబిందెను ఊరేగింపుగా బేడా మండపం వద్ద ఉంచి అంకురార్పణ పూజలు నిర్వహించారు..కల్యాణ క్రతువులో బ్రహ్మ, రుత్విక్ వంటి వైదిక సిబ్బందికి దీక్షా వస్త్రాలను ఈవో శివాజీ అందించారు. వైష్ణవ సంప్రదాయంలో విష్వక్సేన పూజ పుణ్యహ వాచనం కొనసాగించి అభిషేకం చేశారు. పుణ్య జలాలతో ప్రోక్షణ కొనసాగించారు. సాయంత్రం రామాలయం నుంచి ఊరేగింపుగా తాతగుడి వద్దకు వెళ్లి సంప్రదాయ పద్ధతిలో పుట్టమట్టిని తవ్వి పూజలు సాగించారు. అ పవిత్ర మట్టిని పాలికల్లో పోసిన తర్వాత అంకురార్పణ చేశారు. ఈ వేడుక చేస్తున్నంత సేపు భక్తులు పెద్దపెట్టున జైశ్రీరాం అంటూ నినదించి పూజించారు. యాగశాలలోని పూజలు భక్తులను తన్మయులను చేశాయి. నేడు గరుడ పటాన్ని లిఖించి గరుడాధివాసం చేయనున్నారు.
- ఇదీ చదవండి : భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు సమర్పణ