భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 8వ రోజైన నేడు స్వామివారు బలరామ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అంతకుముందు ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి భక్త రామదాసు చేపించిన ఏడు వారాల నగలతో స్వామివారిని అలంకరించారు. నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో అలంకరించిన స్వామి వారికి బేడా మండపంలో ధనుర్మాస పూజలు నిర్వహించారు. మహా నివేదన అనంతరం స్వామివారిని తిరువీధి సేవకు తీసుకెళ్లారు. సకల రాజ లాంఛనాలు, కోలాట నృత్యాలు, వేదమంత్రాల నడుమ స్వామివారు ఆలయం నుంచి బయలుదేరి మిథిలా స్టేడియానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తాతకుడి సెంటర్ వరకు వెళ్లి అక్కడ వేచి ఉన్న భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఉత్సవాల సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. శ్రీకృష్ణుని అన్నగా అవతరించి ధర్మ సంస్థాపనకు సహకరించిన అవతారం బలరామ అవతారమని, ఈ అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం వల్ల పంటలు వృద్ధి చెందుతాయని, ధాన్యరాశులు చేకూరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు.
ఇవీ చదవండి: