భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం నీలాద్రిపేట గుట్టపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా పెంచింది. మావోయిస్టు బృందాలు సంచారిస్తున్నాయనే అనుమానంతో ఇటీవల విస్తృతంగా గాలింపు చేపట్టిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పది రోజులుగా సుమారు 50మంది ప్రత్యేక బలగాలతో పోలీసు ఉన్నతాధికారులు గుట్టపై మళ్లీ కూంబింగ్ చేపడుతున్నారు. బలగాల తనిఖీలతో గిరిజన పల్లెల్లో ఆందోళనకర వాతావరణం కనిపిస్తోంది.
ఏడు బృందాలు వచ్చాయనే సమాచారం..
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి గోదావరి దాటి సుమారు ఏడు బృందాలు కరకగూడెం, పినపాక మండలాల్లోని అటవీ ప్రాంతానికి వచ్చినట్లు పక్కా సమాచారంతో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే కరకగూడెం మండలంలోని అడవుల్లో రెండు మావోయిస్టు టీమ్‌లు సంచరిస్తున్నాయనే కోణంలో కూంబింగ్ చేస్తున్నట్లు సమాచారం.
సుమారు పది రోజులుగా చేస్తున్న కూంబింగ్‌లో మణుగూరు ఏఎస్పీ శబరీష్ పాల్గొంటున్నారు. రాత్రి సమయంలో రెండు లారీల్లో బయల్దేరి వెళ్తున్న పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. పినపాక, కరకగూడెం మండలాల్లో ఉన్నటు ఆదివాసీ గ్రామాల్లోకి వచ్చే కొత్త వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.