భద్రాచల శ్రీరామచంద్రుని పేరును.. శ్రీరామ నారాయణుడు అని పలుకుతూ పూజలు చేస్తున్నారని ఆలయ వైదికులపై భద్రాద్రి ప్రాంత పరిరక్షణ సమితి అధ్యక్షుడు బూసిరెడ్డి శంకర్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు తేజస్వి శర్మ మండిపడ్డారు. భక్తరామదాసు ఆలయం నిర్మించినప్పటి నుంచి శ్రీరామచంద్రుని పేరుమీదే పూజలు జరిగేవని.. కొన్నేళ్లుగా ఆలయ అర్చకులు పేరు మార్చి పూజలు చేస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా ఈ విషయంపై పోరాటం చేస్తున్నా దేవాదాయ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భద్రాద్రి ఆలయంలో పూజలు పాత పద్ధతిలోనే జరగాలని డిమాండ్ చేస్తూ ఆలయ ఈవో కార్యాలయం వద్ద దీక్ష చేపట్టారు. దేవాదాయ శాఖ స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.