భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గంలో జిల్లా కలెక్టర్ ఎం వి రెడ్డి పర్యటించారు. టేకులపల్లి మండలంలో పంట ఉత్పత్తులు, విక్రయాల నిర్వహణకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.వెంకటయ్య తండ గ్రామ పరిధిలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పత్తి విత్తనాలతో దిగుబడి సరిగా రాలేదని రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నివేదికలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలు విక్రయించని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకు పంటలు విక్రయాలు చేయొద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. నీటి సరఫరా కోసం ప్రతి ఇంటి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై సర్పంచ్, సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేసి నివేదిక అందచేయాలని కలెక్టర్ డీపీఓకి సూచించారు.
అనంతరం ఇల్లందులో పర్యటించి రైతు వేదిక నిర్మాణం, పల్లె ప్రకృతి వనం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.. జనవరి 26న జిల్లా స్థాయిలో రైతు వేదికల నిర్మాణాలను పరిశీలించి మూడింటికి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి: సిద్దారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ అజయ్