Bhadrachalam Karakatta Problems : బీఆర్ఎస్ ప్రభుత్వం 2021లో అధికారంలో ఉన్నప్పుడు భారీ వరదల కారణంగా, భద్రాచలంలోని (Bhadrachalam) కొత్త కాలనీ, సుభాశ్‌నగర్, శాంతినగర్, ఏఎంసీ కాలనీ రామాలయం చుట్టూ దిగువ సెంటర్ అయ్యప్ప కాలనీ ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) భద్రాచలం పర్యటనకు వచ్చి గోదావరి కరకట్ట బలోపేతం చేసి ముంపు వాసులకు కాలనీలు కట్టిస్తామని వెయ్యి కోట్లు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
కేసీఆర్ వెయ్యి కోట్లు ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచినా హమీ అమలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంత్రి కేటీఆర్ (KTR)గోదావరి కరకట్ట పొడిగింపునకి రూ.38 కోట్లు మంజూరు చేస్తున్నట్లు శంకుస్థాపన చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. భద్రాచలం నియోజకవర్గం మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా తెల్లం వెంకట్రావు గెలిచారు. ఎన్నికలకు ముందు గెలిపిస్తే కరకట్టను పొడిగించి, భద్రాచలంలోకి వరద రాకుండా చేస్తానని హామీ ఇచ్చారు.
కరకట్టకు నిధులేవి.. గోదావరి లోతట్టు ప్రాంతాల ఆవేదన
Godavari Floods in Bhadrachalam : ఈ నేపథ్యంలో ముంపు కాలనీల ప్రజలంతా, ప్రజాప్రతినిధులు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని, వరద నీరు రాకుండా చూడాలని కోరుతున్నారు. గోదావరి కరకట్ట నిర్మించి చాలా కాలమైంది. ప్రతి ఏటా వచ్చే వరదలతో కరకట్ట వద్ద చాలా వరకు మట్టి కొట్టుకుపోయింది. రాళ్లు తేలాయి. గతంలో వచ్చినట్లుగా గోదావరి వరదలు వస్తే, తమ పరిస్థితి ఏమిటని లోతట్టు కాలనీల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
"భద్రాచలం గోదావరి ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. దాన్ని అధిగమించాలంటే కరకట్టను బలోపేతం చేయాలి. సుభాశ్ నగర్ కాలనీ దగ్గర 450 మీటర్లు పొడవునా మిగిలిపోయినా కరకట్ట పనులు పూర్తి చేయాలి. ఎన్నికల్లో వాగ్దానం చేసిన, కరకట్టను బలోపేతం చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ప్రభుత్వం, అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి."-ఎం.బి.నర్సారెడ్డి, భద్రాచలం
భద్రాచలం కరకట్ట ఖరారు..! ఇకనైనా వరద కష్టాలు తీరేనా..!!
భద్రాచలం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు : భవిష్యత్లో భద్రాచలం సురక్షితంగా ఉండాలంటే వెంటనే కరకట్ట (Bhadrachalam Karakatta)ఎత్తు పెంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. వరదలు వస్తే కరకట్ట లీకై ప్రతి ఏడాది రామాలయం వద్ద గల పడమర మెట్లు, అన్నదాన సత్రం మొత్తం వరద నీటిలో మునిగిపోతుంది. భద్రాచలం స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే సమీక్షించి కరకట్టల బలోపేతానికి పనులు మొదలు పెడితేనే, వచ్చే వర్షాకాలం నాటికి నాటికి ముంపు కాలనీలు వరదబారిన పడకుండా ఉంటాయని ప్రజలు చెబుతున్నారు.
"గత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కింది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సమస్యలను పరిగణలోకి తీసుకొని ముంపు ప్రభావిత ప్రజలకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం." - చింతిరియాల రవికుమార్, కాంగ్రెస్ నాయకులు