భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశం నుంచి భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య వాకౌట్ చేశారు. భద్రాచలంలోని రామయ్యను దర్శించుకునేందుకు, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ భద్రాచలం వచ్చారు. ఈ క్రమంలో ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమ ప్రారంభం సమయంలో భద్రాచలం ఎమ్మెల్యే ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అయితే మంత్రి సత్యవతి రాథోడ్ ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మె న్యాయమైనది కాదని తిరస్కరించారు.
అది నచ్చని ఎమ్మెల్యే పొదెం వీరయ్య సమావేశం మధ్యలోంచి వాకౌట్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల తీర్మానం చేస్తేనే సమావేశంలో ఉంటానని... లేనిపక్షంలో బయటకి వెళ్లిపోతానంటూ బయటకొచ్చేశారు. అనంతరం జరిగిన సమీక్ష సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్ కుమార్ సైనీ, ఐటీడీఏ పీవో గౌతమ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జడ్పీ ఛైర్ పర్సన్ కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత